పాపం లాలూ!... రైలెక్క‌క త‌ప్ప‌లేదు!

Update: 2018-03-30 17:03 GMT
లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌... ఒక‌ప్పుడు దేశంలోనే మంచి పేరున్న రాజ‌కీయ‌వేత్త‌. ఒక‌ప్పుడు ఏం ఖ‌ర్మ‌....మొన్న‌టికి మొన్న బీహార్ లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గ‌ట్టి ఎదురు దెబ్బ కొట్టిన ధీరుడు. రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ (ఆర్జేడీ) పేరిట ప్ర‌త్యేక పార్టీ పెట్టుకున్న లాలూ... బీహార్‌ కు చాలా కాలం పాటు ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. అయితే పశువుల‌కు స‌ర‌ఫ‌రా చేసే దాణాకు సంబంధించిన నిధుల్లో అక్ర‌మాలు చోటుచేసుకున్నాయ‌న్న వ్య‌వ‌హారంలో అనూహ్యంగా లాలూకు ప్ర‌త్య‌క్ష ప్ర‌మేయం ఉంద‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో సీఎం కుర్చీ దిగ‌క త‌ప్ప‌లేదు. అయితే రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన యోధుడైన లాలూ... తాను జైలుకు వెళ్లినా... సీఎం కుర్చీలో త‌న స‌తీమ‌ణి ర‌బ్రీ దేవిని కూర్చోబెట్ట‌గ‌లిగారు. దీంతో జైలు నుంచే ఆయ‌న బీహార్ ను పాలించార‌ని నాడు పెద్ద ఎత్తున క‌థ‌నాలు వినిపించాయి.

ఇక ఆ త‌ర్వాత రైల్వే శాఖ మంత్రిగా లాలూ ప‌నితీరు భార‌త దేశానికే కాకుండా ప్ర‌పంచంలోని చాలా దేశాల‌కు కూడా తెలిసిపోయింది. అప్ప‌టిదాకా భారీ న‌ష్టాల్లో న‌డుస్తున్న భార‌తీయ రైల్వేల‌ను లాలూ చాలా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే లాభాల బాట ప‌ట్టించిన వైనం ఇప్ప‌టికీ మ‌రిచిపోలేని వ్య‌వ‌హార‌మే. ఈ క్ర‌మంలో మా విద్యార్థుల‌కు పాఠాలు చెప్పండంటూ దేశంలోని ప‌లు వ‌ర్సిటీల నుంచే కాకుండా ప్ర‌పంచ దేశాల‌కు చెందిన ప‌లు ప్ర‌తిష్ఠాత్మ‌క వ‌ర్సిటీల నుంచి కూడా లాలూకు ఆహ్వానాలు అందాయి. అయితే ఇదంతా గ‌తం. ఇప్పుడు లాలూ ప‌రిస్థితి ఏమీ బాగోలేదు.

బీహార్ ఎన్నిక‌ల్లో త‌మ‌ను ఓడించార‌న్న ఒకే ఒక్క కార‌ణంతో బీజేపీ స‌ర్కారు లాలూపై క‌క్ష‌గ‌ట్టింద‌ట‌. అంతే బీహార్ ఎన్నిక‌ల్లో లాలూతో క‌లిసి త‌మ‌ను ఓడించిన సీఎం నితీశ్ కుమార్‌కు గాలం వేసిన బీజేపీ ఆ వ్యూహంలో స‌క్సెస్ అయ్యింద‌నే చెప్పాలి. ఇక్క‌డి నుంచే లాలూకు క‌ష్టాలు మొద‌లయ్యాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. అప్ప‌టిదాకా దాణా కేసు విచార‌ణ కాస్తంత స్లోగా న‌డిచినా... ఆ త‌ర్వాత స్పీడందుకుంది. ఏకంగా త‌న‌పై న‌మోదైన నాలుగు కేసుల్లోనూ లాలూ దోషిగా తేలిపోయారు. ఏకంగా 20 ఏళ్ల‌కు పైగా జైలు శిక్ష ప‌డిపోయింది. ప్ర‌స్తుతం రాంచీ జైల్లో కారాగార వాసం చేస్తున్న లాలూకు అనారోగ్యం కూడా తిర‌గ‌బెట్టింది. దీంతో ఆయ‌న‌ను ఢిల్లీ త‌ర‌లించాల‌ని న్యాయ‌స్థానం ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఆదేశాల‌తో లాలూకు ఢిల్లీలో చికిత్స ఇప్పించేందుకు స‌రేన‌న్న జార్ఖండ్ ప్ర‌భుత్వం... లాలూను విమానంలో త‌ర‌లించేందుకు నిధులు లేవ‌ని నిర్మోహ‌మాటంగా చెప్పేసింది. ఇంకేముంది... ఒక‌ప్పుడు తన చేతి కింద న‌డిచిన రైలులోనే లాలూను అధికారులు ఢిల్లీకి త‌ర‌లించారు. రాంచీ నుంచి 16 గంటల పాటు రైల్లో ప్రయాణించిన లాలూ, ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరి చికిత్సను పొందుతున్నారు. ఈ వ్యవ‌హారంపై జార్ఖండ్ మంత్రి సరయూ రాయ్ స్పందించారు. లాలూను విమానంలోనే పంపి ఉండాల్సిందని, రైల్లో ఎందుకు పంపారో త‌న‌కు తెలియదని అన్నారు. దీనిపై ఆర్జేడీ తీవ్రంగా మండిపడింది. ఆయన ఆరోగ్యం బాగాలేదని తెలిసి కూడా అంతదూరం పాటు రైల్లో ప్రయాణానికి ఎలా అనుమతించారని, ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించింది. మొత్తంగా ఒక‌నాడు పాలిటిక్స్‌లో తిరుగులేని వ్యూహ‌క‌ర్త‌గా పేరుగాంచిన లాలూ... ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేందుకు కూడా అవ‌కాశం లేని స్థితిలో ప‌డిపోయారు.

Tags:    

Similar News