లాలూ... నాలుగో కేసులోనూ దోషే!

Update: 2018-03-19 10:26 GMT
బీహార్‌ను త‌న గుప్పిట్లో పెట్టుకున్న‌ట్లే క‌నిపించిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి - రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కు ఇప్పుడు ఏమాత్రం క‌లిసి రావ‌డం లేద‌నే చెప్పాలి. ఇటీవ‌లే బీహార్ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో జేడీయూతో దోస్తీ క‌ట్టి బీజేపీకి గ‌ట్టి షాక్ ఇచ్చిన లాలూ... నితీశ్ ను మూడో ప‌ర్యాయం బీహార్‌ కు సీఎంగా చేయ‌డమే కాకుండా త‌న ఇద్ద‌రు పుత్ర‌ర‌త్నాల‌ను కీల‌క శాఖ‌ల మంత్రులుగా చేశారు. అస‌లు ఆ ఎన్నిక‌ల్లో బీజేపీకి జేడీయూ-ఆర్జేడీ కూట‌మి మ‌ట్టి క‌రిపించడంలో లాలూ వ్యూహాలే కీల‌కంగా ప‌నిచేశాయ‌న్న విశ్లేష‌ణ‌లు వినిపించాయి.

ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించినా... లాలూకు నిజంగానే బ్యాడ్ టైం మొద‌లైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. లాలూ ముద్దాయిగా ఉన్న దాణా కుంభ‌కోణంలో కేసు ద‌ర్యాప్తు స్పీడందుకోవ‌డం, ఆయ‌న కుటుంబ స‌భ్యులు సైతం వ‌రుస‌గా కేసుల్లో ఇరుక్కున్న నేప‌థ్యంలో ఆయ‌న‌ ఇద్ద‌రు కుమారులు కూడా నితీశ్ కేబినెట్ నుంచి బ‌య‌ట‌కు రాక త‌ప్ప‌లేదు.  ఈ క్ర‌మంలో కీడును శంకించిన లాలూ కేంద్రంపై పోరాటం చేసేందుకు ప‌క్కా వ్యూహాన్ని ర‌చించుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపించాయి. అయితే ఆ వ్యూహాల ర‌చ‌న పూర్తి కాక‌ముందే... లాలూ చ‌క్ర‌బందంలో కూరుకుపోయారు. తాను సీఎంగా ఉన్న స‌మ‌యంలో ప‌శువుల దాణాకు సంబంధించిన నిధుల్లో నుంచి రూ.3.13 కోట్ల మేర నిధుల‌ను లాలూ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా డ్రా చేసుకున్నార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

దాణా స్కాంగా దేశంలో పెను క‌ల‌క‌ల‌మే రేపిన ఈ కేసు ద‌ర్యాప్తును సీబీఐ చేప‌ట్ట‌గా... మొత్తంగా నాలుగు కేసులు లాలూపై దాఖ‌ల‌య్యాయి. వీటిలో ఇప్ప‌టికే మూడు కేసుల్లో తీర్పు రాగా... ఆ మూడింటిలోనూ లాలూ దోషిగా తేల్చేస్తూ రాంచీలోని సీబీఊ ప్ర‌త్యేక‌ కోర్టు సంచ‌ల‌న తీర్పులు వెలువ‌రించింది. తాజాగా కాసేప‌టి క్రితం నాలుగో కేసులోనూ తీర్పును వెలువ‌రించిన కోర్టు... ఈ కేసులోనూ లాలూను దోషిగానే ప్ర‌క‌టించింది. ఈ కేసులో లాలూను దోషిగా ప్ర‌క‌టించిన కోర్టు... శిక్ష‌ను మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. ఇదిలా ఉంటే... ఈ కేసులో లాలూతో పాటు సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త జ‌గ‌న్నాథ మిశ్రా కూడా నిందితుడిగా ఉన్నారు. లాలూను దోషిగా ప్ర‌క‌టించిన కోర్టు... మిశ్రాను మాత్రం నిర్దోషిగా ప్ర‌క‌టించింది.
Tags:    

Similar News