మూడేళ్ల త‌ర్వాత‌.. లాలూ.. రంగ ప్ర‌వేశం.. వ‌ర్చువ‌ల్ భేటీలో నేత‌ల‌కు దిశానిర్దేశం!

Update: 2021-05-10 11:30 GMT
బీజేపీపై నిప్పులు చెరిగే నాయ‌కుల్లో ఆయ‌న ఒక‌రు. దేశాన్ని పిడివాదంవైపు న‌డిపిస్తామ‌నే ఆర్ ఎస్ ఎస్ అంటే.. మండిప‌డే నాయ‌కుడు ఆయ‌న‌. ముఖ్యంగా.. అన్ని మ‌తాలు, మ‌నుషుల‌ను స‌మానంగా గౌర‌వించ లేని పార్టీగా బీజేపీపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టి.. అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన నేత‌. ఆయ‌నే.. బిహార్ మాజీ ముఖ్య‌మంత్రి.. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌. బిహార్ సీఎంగా త‌న‌దైన ముద్ర వేసిన‌.. ఆయ‌న కేంద్ర రైల్వే మంత్రిగా కూడా ప‌నిచేసి.. పేద వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌యాణికుల‌కు సైతం రైళ్ల‌లో కుష‌న్ కుర్చీలు, బెడ్లు ఎందుకు ఇవ్వ‌కూడ‌దు..? అని పార్ల‌మెంటులో ప్ర‌శ్నించిన ఏకైక రైల్వే మంత్రి.

అయితే.. దాణా కుంభ‌కోణం నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌స్తుతం జైల్లో ఉన్నప్ప‌టికీ.. ఆయ‌నకు ఒక్క బిహార్లోనే కాకుండా.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న లాలూపై.. ఒకానొక ద‌శ‌లో ఆశ‌లు కూడా వ‌దులుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే.. ఆయ‌న కోలుకున్నార‌నే వార్త‌లు మ‌ళ్లీ సొంత పార్టీ రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్‌(ఆర్జేడీ )లో ఆశ‌లు రేపాయి. అంతేకాదు.. తాజాగా ఆయ‌న వ‌ర్చువ‌ల్ విధానంలో త‌న పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తోనూ భేటీ అయ్యారు. దాదాపు మూడేళ్ల త‌ర్వాత‌.. లాలూ.. త‌న పార్టీ నేత‌ల‌తో మాట్లాడ‌డం సంచ‌ల‌నంగా మారింది.

పార్టీలోని ముఖ్య నేతలతో ఆదివారం వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, కరోనా, పార్టీ స్థితిగతులపై చర్చించారు. సీనియర్లందరూ లాలూకు సలహాలు కూడా ఇచ్చారు. అయితే కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే కీలక నేతలతో చర్చించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేనందునే ఇంత తక్కువ సమయం మాట్లాడారని పార్టీ నేతలు పేర్కొన్నారు. ‘‘ఇది చాలా కష్ట సమయం. ప్రజలు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నారు. మీమీ ప్రాంతాల్లో చాలా చురుకుగా ఉండండి. అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ తరపున సహాయ కేంద్రాలను కూడా ప్రారంభించండి’’ అంటూ లాలూ ప్రసాద్ సూచించారు.

అయితే లాలూ ఆరోగ్యం బాగోలేదని ఆయ‌న‌ కుమారుడు ప్ర‌స్తుత ఆర్జేడీ చీఫ్‌ తేజస్వీ యాదవ్ పేర్కొన్నా రు. అందుకే ఎక్కువ సేపు మాట్లాడలేకపోతున్నారని తెలిపారు. అయితే.. లాలూ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని ఆర్జేడీ కార్య‌క‌ర్త‌లు మాత్ర‌మే కాదు.. బీజేపీని వ్య‌తిరేకించే వ‌ర్గాలు కూడా కోరుతుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News