బాబు భుజాలపై తుపాకీ పెట్టి కాలుస్తున్నాడుగా!

Update: 2018-03-09 04:45 GMT
కాలం చాలా చిత్ర‌మైంది. ఒకప్పుడు ఇష్టారాజ్యంగా ఆటాడుకున్న‌ట్లుగా ప్ర‌తి ఒక్క‌రికి టార్గెట్ గా నిలిచే న‌రేంద్ర మోడీపై ఇప్పుడు విమ‌ర్శ చేయ‌టానికి కూడా సంకోచించే ప‌రిస్థితి. ఒక‌వేళ ధైర్యం చేసి నోరు తెరిచే ప్ర‌య‌త్నం చేసినా.. విచార‌ణ అధికారులు.. విచార‌ణ సంస్థ‌లు.. ఇలా ఒక్కొక్క‌టి రంగంలోకి దిగుతున్న‌ట్లుగా విమ‌ర్శ‌లు వ‌స్తున్న ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. రాబోయే రోజుల్లో చోటు చేసుకునే ప‌రిణామాల గురించి పెద్ద‌గా జంక‌కుండా మోడీతో క‌టీఫ్ చెప్పేశారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.

రాష్ట్రంలోని ప్ర‌త్యేక ప‌రిస్థితుల నేప‌థ్యంలో కేంద్ర మంత్రి వ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు.. మోడీతో పూర్తిగా తెగ‌తెంపులు చేసుకోవ‌టానికి  సాహ‌సించ‌లేద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. పూర్తిగా క‌టీఫ్ చేసుకుంటే జ‌రిగే న‌ష్టం బాబుకు తెలియంది కాదు. అందుకే ఆచితూచి వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి.

మోడీతో క‌టీఫ్ చేసుకునే విష‌యంలో చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పంద‌న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. జాతీయ స్థాయిలో స్పంద‌న మిశ్ర‌మంగా ఉంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. తెలుగు మీడియాలో బాబు నిర్ణ‌యాన్ని ప్ర‌చారం చేసే విష‌యంలో ఆస‌క్తి చూపించినప్ప‌టికీ.. బాబుదే విజ‌య‌మ‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించ‌లేద‌ని చెప్పాలి. జాతీయ మీడియాలోనూ బాబు నిర్ణ‌యం కేంద్రానికి షాక్ అన్న‌ట్లుగా ఏమీ లేద‌న్నట్లే వ్య‌వ‌హ‌రించాయి.

ఇదిలా ఉంటే.. కొంద‌రు జాతీయ నేత‌లు మాత్రం బాబు నిర్ణ‌యాన్ని పొగిడేశారు. బాబు అంత శూరుడు.. వీరుడు మ‌రొక‌రు లేర‌న్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేసేశారు. అవినీతి కేసుల్లో పీక‌ల్లోతు కూరుకుపోయిన ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ సంగ‌తే చూస్తే.. ఏపీ ప్ర‌త్యేక హోదా అంశంపై త‌న వైఖ‌రికి క‌ట్టుబ‌డి ఉన్న ఆ రాష్ట్ర సీఎం చంద్ర‌బాబు ధైర్యానికి శెల్యూట్ చేస్తున్నామ‌న్నారు. తెలంగాణ ఏర్పాటుతో ఏపీకి ఎలా న‌ష్టం జ‌రిగిందో.. జార్ఖండ్ ఏర్పాటుతో బీహార్ ది అదే ప‌రిస్థిత‌ని.. కానీ రెండు రాష్ట్రాల సీఎంల మ‌ధ్య భారీ వ్య‌త్యాసం క‌నిపిస్తోందంటూ లాలూ వ్యాఖ్య‌లు చేశారు.

అంతేకాదు.. ఏపీ సీఎం చంద్ర‌బాబును చూసైనా స‌రే.. నోరు తెరిచి మాట్లాడాలంటూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు లాలూ స‌వాలు విస‌ర‌టం చూస్తుంటే బాబుకు కొత్త తిప్ప‌లు తెచ్చేలా ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

లాలూ మాట‌లు బాబును హీరోలా అభివ‌ర్ణించ‌టం.. ఆయ‌న్ను మోడీపై  ఉసిగొల్పేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంతేకాదు.. హోదా సాధ‌న‌కు జాతీయ స్థాయిలో మ‌రిన్ని రాష్ట్రాలు ముందుకు రావాల‌న్న చందంగా లాలూ మాట‌లు ఉండ‌టంతో పాటు.. దీనంత‌టికి స్ఫూర్తిదాత చంద్ర‌బాబు అన్న అభిప్రాయం వ‌చ్చేలా ఉండ‌టం కొస‌మెరుపుగా చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News