ఇప్పుడు అమెరికా విమానాల్లోకి ల్యాప్‌ టాప్‌ ఓకే

Update: 2017-07-05 10:00 GMT
అగ్ర‌రాజ్యం అమెరికా వెళ్లే విమానాల్లో ల్యాప్‌ టాప్‌ ను తీసుకెళ్లరాదు అన్న నిబంధ‌న‌ను ఎత్తివేస్తున్న‌ట్లు ఎమిరేట్స్ విమాన‌సంస్థ పేర్కొంది. అమెరికా విధించిన నిషేధం త‌మ‌కు వ‌ర్తించ‌దు అని ఆ సంస్థ తాజాగా వెల్ల‌డించింది. ఎనిమిది ముస్లిం దేశాల నుంచి వ‌స్తున్న విమానాల‌పై అగ్ర‌రాజ్యం అమెరికా కొన్ని ఆంక్ష‌లు పెట్టింది. విమానాల్లో ల్యాప్‌ టాప్‌ ను అనుమ‌తించ‌రాదు అని ఆర్డ‌ర్ చేసింది. ఉగ్ర‌వాదులు ల్యాప్‌ టాప్ బాంబుల‌తో దాడి చేసే అవ‌కాశం ఉంద‌న్న అనుమానంతో అమెరికా వాటిపై నిషేధం విధించింది. ఆ ఆదేశాల‌తో ఎమిరేట్స్‌, ఇథియాద్ లాంటి విమాన సంస్థ‌లు క‌ఠిన నియ‌మాల‌ను అమ‌లు చేయాల్సి వ‌చ్చింది

భ‌ద్ర‌త కోణంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని గౌర‌విస్తూనే ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్న‌ట్లు ఎమిరేట్స్ స్ప‌ష్టం చేసింది. కొత్త త‌ర‌హా సెక్యూర్టీ నియ‌మావ‌ళిని అవ‌లంబిస్తామ‌ని అమెరికా అధికారుల‌కు హామీ ఇచ్చిన‌ట్లు ఎమిరేట్స్ సంస్థ పేర్కొంది. త‌ద్వారా ప‌టిష్ట‌మైన ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు అమెరికా ఉన్న‌తాధికారుల‌కు వివ‌రించామ‌ని తెలిపింది. అమెరికాలోని 12 న‌గ‌రాల‌కు ఎమిరేట్స్ విమానాలు వెళ్తున్నాయి. అబూదాబీకి చెందిన ఇథియాద్ విమానాల‌పైన కూడా అమెరికా ల్యాప్‌టాప్ నిషేధాన్ని ఎత్తివేసింది.
Tags:    

Similar News