ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?

Update: 2022-03-01 06:58 GMT
‘రాబోయే ఎన్నికల్లో 75 మంది ఎంఎల్ఏలను గెలిపించే శక్తి మాకుంది’ ఇది తాజాగా ఉపాధ్యాయసంఘాల నేతలు ప్రభుత్వానికి చేసిన హెచ్చరిక. పీఆర్సీ, ఐఆర్, పీఆర్సీ నివేదిక బయటపెట్టడం లాంటి అంశాలపై ఉపాధ్యాయసంఘాలు ప్రభుత్వాన్ని తాజాగా హెచ్చరించింది. తమ డిమాండ్ల సాధనకోసం ఉపాధ్యాయసంఘాలు, కార్మిక, పించన్ దారుల సంఘాల నేతలు జగన్ కు లేఖ రాశారు.

ఈ సదర్భంగా మీడియాతో మాట్లాడుతు రాష్ట్రంలో 75 మంది ఎంఎల్ఏలను గెలిపించే శక్తి తమకున్నట్లు చెప్పారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే తగిన గుణపాఠం చెబుతానంటు వార్నింగ్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. 75 మంది ఎంఎల్ఏలను గెలిపించే శక్తి తమకుందని నేతలు పైకి  చెప్పినా తమతో పెట్టుకుంటే  వైసీపీ ఎంఎల్ఏలను ఓడిస్తామని అంతర్లీనంగా హెచ్చరిస్తున్నట్లే ఉంది.

పీఆర్సీ అమలు, జీతాలు పెంపు తదితర అంశాలపై ఉద్యోగులు, పించనుదారుల్లో ప్రభుత్వంపైన తీవ్రమైన అసంతృప్తి ఉందని నేతలు చెప్సారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు జగన్ను కలుద్దామని ఎన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదని కూడా నేతలన్నారు.  క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తే పీఆర్సీ రగడ దాదాపు ముగిసినట్లే అని ప్రభుత్వం అనుకుంటోంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటికి 2 లక్షల విజ్ఞప్తులను పంపినట్లు నేతలంటున్నారు.

గతంలో పీఆర్సీ సాధన సమితిలో కీలక నేతల్లో ఒకరైన బండి శ్రీనివాసరావు కూడా ఇలాగే మాట్లాడారు. తాము తలచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని, లేకపోతే కుర్చీలో కూర్చోబెట్టగలమని చెప్పటం పెద్ద దుమారాన్నే రేపింది. ఆ తర్వాత తాము అలా మాట్లాడలేదని బండి వివరణ ఇచ్చుకున్నారు. ఇపుడు ఉపాధ్యాయ, కార్మిక, పించన్ సంఘాల నేతలు అలాగే మాట్లాడారు. ఉద్యోగులే ప్రభుత్వాలను కూర్చోబెట్టలేరు, కూల్చేయలేరన్నది వాస్తవం.

కాకపోతే కొందరి మైండ్ సెట్ ను ఉద్యోగులు ఏమన్నా ట్యూన్ చేయగలరంతే. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఉద్యోగులు, పించన్ దారులతో పాటు వాళ్ళ కుటుంబాల ఓట్లు మహా అయితే 40 లక్షలుంటుంది. ఇప్పటికే వీళ్ళల్లో చాలామంది పార్టీల వారీగా చీలిపోయున్నారు.

కాబట్టి ఉద్యోగుల నేతలు చెప్పినంత మాత్రాన ఉద్యోగులంతా ఓట్లేస్తారని అనుకుంటే అది భ్రమలు మాత్రమే. అలాగే జనాలంతా ఒకపార్టీకి ఓట్లేయాలని అనుకుంటే ఉద్యోగులు చేయగలిగేది దాదాపు శూన్యమనే చెప్పాలి. కాకపోతే ఇలాంటి మాటల వల్ల వీళ్ళకు నష్టమే తప్ప లాభం లేదని నేతలు గ్రహించాలి.
Tags:    

Similar News