భీమ్లా ఎఫెక్ట్: కొడాలి నాని - పేర్ని నానిలకు నిరసన సెగ..!

Update: 2022-02-25 07:31 GMT
పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం.. అధిక టికెట్ ధరలకు అమ్మితే థియేటర్ యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రులు కొడాలి నాని - పేర్ని నానిలకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి నిరసన సెగ తగిలింది.

కృష్ణా జిల్లా గుడివాడలో ఓ థియేటర్ ప్రారంభోత్సవానికి ఈరోజు కొడాలి నాని - పేర్ని నానిలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జన సేన కార్యకర్తలు మంత్రులను అడ్డుకునేందుకు యత్నించారు. పవన్ కల్యాణ్ మీద ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రులను అడ్డుకునేందుకు యత్నించిన గుడివాడ జనసేన ఇంఛార్జ్ తో పాటుగా పలువురు పవన్ అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమాను కక్షపూరితంగా అడ్డుకోవడం దారుణమని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని నానికి వినతి పత్రం అందించేందుకు వచ్చిన తమను అరెస్ట్ చేయడం ఏంటని మండిపడ్డారు. ఇకపోతే ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే సినిమా టిక్కెట్లు అమ్మాలంటూ రెవెన్యూ అధికారులు ఆదేశాలివ్వడంతో.. ఆయా థియేటర్స్ వద్ద పోలీసుల్ని మోహరింపచేశారని తెలుస్తోంది.

'భీమ్లా నాయక్' సినిమాపై జగన్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని అభిమానులు తప్పుపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు థియేటర్ల వద్ద ఆందోళన చేపట్టారు. కృష్ణా జిల్లా మైలవరంలో నారాయణ థియేటర్ లో తక్కువ ధరలతో మూవీ ప్రదర్శనను వచ్చే నెల 13 వరకు నిలుపుదల చేస్తున్నట్లు యాజమాన్యం బోర్డ్ పెట్టారు. దీంతో థియేటర్ ముందు పవన్ అభిమానులు నిరసనకు దిగారు.

అనంతపురం తాడిపత్రిలో లక్ష్మీ నారాయణ థియేటర్ లో కుర్చీల్ని ధ్వంసం చేశారు. సినిమాను సరిగా ప్రదర్శించక పోవడం.. సౌండ్ సరిగా రాకపోవడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ కుర్చీలు ధ్వంసం చేసి డోర్లు బద్దలుకొట్టారు. దాంతో పోలీసులు థియేటర్ వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపు చేసారు. అలానే గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఈ సినిమాకు అడ్డంకులు ఏర్పడ్డాయి.

కొల్లూరులో 'భీమ్లా నాయక్' సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ కి బీఫామ్ లేదని అధికారులు షోలు మొత్తం రద్దు చేశారు. సినిమా రద్దు చేయటంతో బస్టాండ్ సెంటర్లో పవన్ కళ్యాణ్ అభిమానులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే - ఎమ్మార్వో కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ సర్కారు తమ అభిమాన హీరో మీద కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఫ్యాన్స్ ఆందోళనతో వేమూరు భట్టిప్రోలు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News