ఎవ‌రి దారి వాళ్ల‌దే.. ఇక కాంగ్రెస్ బాగు ప‌డ్డ‌ట్లే

Update: 2022-03-21 10:32 GMT
ఒక‌రేమో మ‌న ఊరు- మ‌న పోరు బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.. మ‌రొక‌రేమో స‌ర్వోద‌య సంక‌ల్ప యాత్ర‌లో పాల్గొని ప్ర‌భుత్వ విధానాల‌పై మండిప‌డ్డారు.. ఇక కొంత మంది సీనియ‌ర్ నేత‌లేమో ప్ర‌త్యేకంగా స‌మావేశం నిర్వ‌హించారు.. ఈ మూడు కార్య‌క్ర‌మాల్లో వేర్వేరు పార్టీల నాయ‌కులు ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నార‌ని అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఈ మూడు కార్య‌క్ర‌మాలు ఒకే పార్టీ నేత‌ల ఆధ్వ‌ర్యంలో జ‌రిగాయి. వాళ్లు కాంగ్రెస్ నాయ‌కులు. దీన్ని బ‌ట్టి తెలంగాణ‌లో ఆ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోచ్చు. ఎవ‌రి దారి వారిదే అన్న‌ట్లు నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం పార్టీకి చేటు చేస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అధ్య‌క్షుడు అక్క‌డ‌..

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికైన‌ప్ప‌టి నుంచి సీనియ‌ర్లకు, ఆయ‌నకు మ‌ధ్య విభేదాలు మొద‌లైన సంగ‌తి తెలిసిందే. రోజురోజుకూ అవి తీవ్ర రూపం దాల్చుతున్నాయి కానీ త‌గ్గ‌డం లేదు. తాజాగా ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జ‌రిగిన మ‌న‌ ఊరు- మ‌న పోరు బహిరంగ స‌భ‌లో రేవంత్ పాల్గొన్నారు. ఇలా కార్య‌క్ర‌మాల్లో పార్టీ నేత‌లంతా క‌లిసి ఒక్క‌టిగా పాల్గొంటే పార్టీపై ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందే వీలుంటుంది.

కానీ చాలా మంది సీనియ‌ర్ నేత‌లు ఈ స‌భ‌కు హాజ‌రు కాలేదు. యాసంగి ధాన్యాన్ని ప్ర‌భుత్వం కొనుగోలు చేయాల్సిందేన‌ని లేదంటే కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు సునామీ సృష్టిస్తార‌ని ఈ స‌భలో రేవంత్ హెచ్చ‌రించారు.

ఉత్త‌మ్ అక్క‌డ‌.. సీనియ‌ర్లు ఇక్క‌డ‌

మ‌రోవైపు ఆదివార‌మే స‌ర్వోద‌య సంక‌ల్ప యాత్ర‌లో సీనియ‌ర్ నేత ఎంపీ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి పాల్గొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మాజీ ఎంపీ మీనాక్షి న‌ట‌రాజ‌న్ చేప‌ట్టిన స‌ర్వోద‌య సంక‌ల్ప యాత్ర తూప్రాన్ చేరుకున్న సంద‌ర్భంగా ఆ యాత్ర‌కు ఉత్త‌మ్ స్వాగ‌తం ప‌లికారు. ఎల్లారెడ్డిలోనేమో రేవంత్ హాజరైన మ‌న ఊరు- మ‌న పోరు స‌భ‌కు వెళ్ల‌కుండా ఈ యాత్ర‌లో ఉత్త‌మ్ పాల్గొన‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. మ‌రోవైపు వీహెచ్‌, జ‌గ్గారెడ్డి, మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి త‌దిత‌ర నాయ‌కులు ఓ హోట‌ల్‌లో స‌మావేశ‌మ‌వ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

రేవంత్ త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం పార్టీని వాడుకుంటున్నార‌ని, ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని ఈ సీనియ‌ర్ నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. త్వ‌ర‌లోని రేవంత్‌పై సోనియా, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తామ‌ని అంటున్నారు. ఇలా ఒకే రోజు ఒకే పార్టీకి చెందిన నాయ‌కులు ఎవ‌రి ఇష్టం వ‌చ్చిన‌ట్లు వాళ్లు వ్య‌వ‌హ‌రించ‌డం పార్టీ శ్రేణుల‌కు ఆందోళ‌న క‌లిగిస్తోంది. అంద‌రూ క‌లిసి పార్టీని న‌డిపించాల్సింది పోయి ఇలా ఎవ‌రి దారి వాళ్లు చూసుకుంటే ఇక పార్టీ బాగు ప‌డ్డ‌ట్లే అని నిట్టూరుస్తున్నారు.
Tags:    

Similar News