కడపలో అలా.. అర్ధరాత్రి వేళ పెట్రోల్ బంక్ కోసం అన్న క్యాంటిక్ కూల్చివేత

Update: 2022-03-23 05:33 GMT
విలువైన ప్రజాధనాన్ని తమకు తోచినట్లుగా వేస్టు చేయటంలో పాలకుల ట్రాక్ రికార్డు ఏ మాత్రం బాగుండదు. ఇదే విషయం మరోసారి నిరూపితమైంది. కడప పట్టణంలో నాలుగేళ్ల క్రితం అధునాతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ ను తాజాగా కూల్చేశారు. అర్ధరాత్రి వేళలో వచ్చిన అధికారులు.. బ్రహ్మాండంగా ఉన్న క్యాంటీన్ భవనాన్ని నేలమట్టం చేసేశారు. సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను నిలిపి వేయడం తెలిసిందే.

పేదలకు నాణ్యమైన భోజనాన్ని కేవలం రూ.5 లకు అందించే ఈ క్యాంటీన్లను మూసేశారు. ఈ సందర్భంగా భవనం దేనికి ఉపయోగించకుండా ఉండిపోయింది. కొత్త భవనాన్ని మరే ఆఫీసుకైనా వాడుకునే వీలుంది. కానీ.. దాన్ని నామరూపాల్లేకుండా చేసి కూల్చేయటం గమనార్హం. అన్న క్యాంటీన్ తో దూర ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం కడప పట్టణానికి వచ్చే ఎంతో మంది ఆకలిని అతి తక్కువ ఖర్చుతో తీర్చేది.

నిత్యం ఐదు వందల మందికి భోజనాన్ని పెట్టిన అన్న క్యాంటీన్ ను మూసేయడం ఒక ఎత్తు అయితే.. తాజాగా దాన్ని రాత్రికి రాత్రే కూల్చేయటం షాకింగ్ గా మారింది. దాదాపు రూ.30 లక్షల ప్రజా ధనంతో నిర్మించిన ఈ క్యాంటీన్ భవనాన్న వేరే దానికి వాడినా బాగుండేదన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ అన్న క్యాంటీన్ ను ఎందుకు కూల్చేశారన్న విషయంలోకి వెళితే.. ఇదే ప్లేస్ లో ఒక పెట్రోల్ బంక్ ను నగరపాలక సంస్థ ఏర్పాటు చేయాలని భావించిందని.. అందుకే కూల్చేసినట్లు చెబుతున్నారు.

నిజానికి పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేయాలని భావిస్తే.. పట్టణంలో చాలా చోట్ల ఖాళీ స్థలాలు ఉన్నాయి. కానీ.. అలా కాకుండా అన్న క్యాంటీన్ భవనాన్ని టార్గెట్ చేయటం వెనుక ప్రత్యేకమైన కారణం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చక్కగా ఉన్న భవనాన్ని ఇలా కూల్చేయటం ద్వారా విలువైన ప్రజాధనాన్ని వేస్టు చేయటం కాక మరేంటి? ఇంకేమైనా అవసరాలకు వినియోగిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News