ఎన్నికలను రేవంతే డిసైడ్ చేస్తారా ?

Update: 2022-03-07 05:52 GMT
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు రాబోతున్నాయి ? ముందస్తు ఎన్నికలకు  కేసీఆర్ ఎప్పుడు వెళ్ళబోతున్నారనే విషయాలను కూడా రేవంతే చెప్పేస్తున్నారు. మామూలుగా అయితే ముందస్తు ఎన్నికలు లేదా మధ్యంతర ఎన్నికల గురించి ముఖ్యమంత్రే మాట్లాడుతారు. ఈ విషయం ముందుగా అధికార పార్టీలోనే చర్చకు వస్తుంది. తర్వాత లీకుల రూపంలో మీడియాకు కూడా అందుతుంది.

కానీ తెలంగాణలో మాత్రం విచిత్రంగా రాబోయే డిసెంబర్లోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నారనే చెప్పారు. డిసెంబర్లో ఎన్నికలు మొదలవుతాయట, ఫిబ్రవరి-మార్చిలో కొత్త ప్రభుత్వం ఏర్పడతుందని రేవంతే చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఇదే విషయాన్ని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా చెబుతున్నారు. అయితే బండి డిసెంబర్ అని ఫిబ్రవరి, మార్చని నెలలు మాత్రం చెప్పలేదు.

మధ్యంతర ఎన్నికలో లేకపోతే ముందస్తు ఎన్నికల గురించో చెప్పాల్సిన కేసీయార్ మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. పైగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన తనకు లేదని కూడా క్లారిటి ఇచ్చారు.

అయినా వీళ్ళిద్దరు ఏమాత్రం ఆగటం లేదు. చూడబోతే వీళ్ళద్దరే కేసీయార్ ను హిప్నొటైజ్ చేసేసి డిసెంబర్లో ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్ళేలా మైండ్ ట్యూన్ చేస్తున్నారా ? అనే డౌటు పెరిగిపోతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజీనామాలు చేయటం, ఉపఎన్నికలు తెప్పించటం లేదా ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం కేసీయార్ కు కొత్తేమీ కాదు. తెలంగాణా రావటానికి ముందు ఎంఎల్ఏగా ఎంపీగా ఉన్నపుడు చాలాసార్లే రాజీనామాలు చేసి ఉపఎన్నికలు తెప్పించారు.

అలాగే ముఖ్యమంత్రి హోదాలో 2018లోనే తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలు జరిపించుకున్నారు. అందుకనే రేవంత్, బండి పదే పదే ముందస్తు ఎన్నికల గురించి అంతగా మాట్లాడుతున్నారు. మొత్తానికి ఏదేమైనా ముందస్తు ఎన్నికలు జరిపించాల్సిందే అన్నట్లు రేవంత్,  బండి బాగా పంతం పట్టినట్లే ఉంది చూస్తుంటే.
Tags:    

Similar News