'బుల్ డోజర్ల' వ్యాఖ్య పై రాజాసింగ్ తాజా వివరణ విన్నారా?

Update: 2022-02-17 04:26 GMT
నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఈ మధ్య రాజకీయ నేతలకు ఒక అలవాటుగా మారింది. అధికారం చేతిలో ఉంటే చాలు.. తాము ఏమన్నా సరే నడిచిపోతుందన్నట్లుగా వారి తీరు ఉంటోంది. తాజాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు విన్న వారంతా నోరు వెళ్లబెట్టే పరిస్థితి. మరీ.. ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయటమా? అని ఆశ్చర్యపోతున్నారు. యూపీలో యోగికి ఓటు వేయని వారి ఇళ్లపై జేసీబీలు.. బుల్ డోజర్లను పంపుతామంటూ చేసిన అత్యుత్సాహపు వ్యాఖ్యలు.. బీజేపీకి పెద్ద తలనొప్పిని తెచ్చి పెట్టటమే కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం సైతం తక్షణం స్పందించింది.

ఈ వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని.. అసలు మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో సమాదానం చెప్పాలన్న డెడ్ లైన్ కూడా పెట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం తాఖీదు ఇచ్చినా.. రాజాసింగ్ నోటి మాటల్లో మాత్రం  తేడా రాలేదు. అంతేనా.. సీఈసీ విధించిన 24 గంటల డెడ్ లైన్ ను పిచ్చ లైట్ తీసుకున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తన ఆఫీసుకు నోటీసులు వచ్చిన విషయం తనకు ఇప్పుడే తెలిసిందన్న ఆయన బుధవారం రాత్రి స్పందించారు. తాను యూపీలో యోగి సర్కారు మరోసారి అధికారంలోకి రావాలంటూ హోమం నిర్వహించేందుకు ఉజ్జయిని వెళుతున్నట్లుగా పేర్కొన్నారు. తాను మూడు రోజుల్లో తిరిగి వస్తానని.. అనంతరం తన లాయరర్ ద్వారా.. కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇస్తానని పేర్కొన్నారు. బుల్ డోజర్లను పంపి తొక్కించేస్తానంటూ తాను చేసిన వ్యాఖ్యకు అసలు అర్థం వేరే ఉందంటూ చెబుతున్నారు రాజాసింగ్.

గతంలో అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తరప్రదేశ్ లో ఎన్నో అరాచకాలు జరిగాయని.. ఆ ఆరాచకాలను వివరించే ప్రయత్నమే తాను చేశానన్నారు.

ఆవు మాంసం తినే వారు తనపై కుట్రలు చేస్తున్నట్లు పేర్కొన్న ఆయన.. యోగి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గుండాయిజాన్ని అంతమొందించారన్నారు. గుండాలు కబ్జా చేసిన స్థలాల్లో యోగి ప్రభుత్వం పేదల కోసం లక్షల ఇళ్లు కట్టించిందన్న ఆయన.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ గెలిస్తే ఏమవుతుంది? యోగి మరోసారి అధికారంలోకి వస్తే మరేం అవుతుందన్న దానిపై తాను వ్యాఖ్యానించానని పేర్కొన్నారు.

తాను ఏమీ తప్పు మాట్లాడలేదని.. కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇస్తానని చెప్పుకొచ్చారు. అయినా.. యోగికి ఓట్లు వేయని వారిని బుల్ డోజర్లు పెట్టి తొక్కిస్తామన్న మాటకు.. అఖిలేశ్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న రచ్చకు లింకేమిటి? అన్న ప్రశ్నతో పాటు.. అంతేసి మాటలు అన్నప్పుడు.. దాన్ని ప్రశ్నించినంతనే అతికినట్లుగా ఉండే మాట రాజాసింగ్ నోట రాకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. 24 గంటల్లో బదులివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశిస్తే.. మూడు రోజుల తర్వాత సమాదానం ఇస్తానని చేసిన వ్యాఖ్యలపై సీఈసీ ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.
Tags:    

Similar News