బీజేపీ రోడ్ మ్యాప్ లో ఆ పార్టీ ఎలిమినేషన్...?

Update: 2022-03-15 07:29 GMT
బీజేపీ రోడ్ మ్యాప్ అన్నది ఇపుడు ఏపీలో హాట్ హాట్ చర్చగా ఉంది. ఈ రోడ్ మ్యాప్ గురించి పవన్ ఏకంగా బహిరంగ సభలో చెప్పేసి అతి పెద్ద చర్చకు తావిచ్చారు. నిజానికి రోడ్ మ్యాపుల గురించి,  రాజకీయ వ్యూహాల గురించి తెర వెనక ఎవరైనా మాట్లాడుకుంటారు. అవన్నీ సీక్రెట్ గా జరిగిపోయే వ్యవహారాలు. పార్టీల ప్లాన్స్ అన్నీ అందులో ఉంటాయి. వాటిని నాయకుల స్థాయిలోనే రివీల్ చేస్తారు.

నాలుగు గోడల మధ్యన వాటి మీద డిస్కషన్స్ ఉంటాయి. అలాంటి పొలిటికల్ రోడ్ మ్యాప్ గురించి వేలాది మంది తరలివచ్చిన భారీ బహిరంగ సభలో పవన్ చెప్పారు. నిజానికి ఇది పవన్ తన అపరిపక్వ రాజకీయంతో చేశారా. లేక కావాలని చేశారా అంటే రెండవదే నిజం అంటున్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పవన్ కి ఏది బయట చెప్పాలి. ఏది దాచాలి అన్నది తెలియదు అంటే ఎవరూ ఒప్పుకోరు.

మరి పవన్ బీజేపీ ప్రస్థావనను ఎందుకు అలా బయటకు తెచ్చారు అంటే అక్కడే ఉంది రాజకీయ మతలబు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తానని అంటోంది అని చెప్పడం ద్వారా తనతో చెలిమి కోరే ఇతర పార్టీలకు బాహాటంగా అదొక సంకేతాన్ని ఇవ్వడం. అలాగే ఇప్పటిదాకా పవన్ నోట ఈ మధ్య కాలంలో బీజేపీ ప్రస్తావన అయితే రాలేదు. దాంతో ఏదో గ్యాప్ ఉందని అంతా భావిస్తున్నారు.

ఆ గ్యాప్ విషయం ఏంటి అన్నది చెప్పాలని కూడా బీజేపీ సభలో కోరి  ప్రస్థావించారు అని అంటున్నారు. సరే తనతో వన్ సైడ్ లవ్ అంటూ అర్జీ పెట్టుకున్న టీడీపీకి శుభవార్తను పూర్తిగా వినిపించకుండా దానికి మధ్య బ్రేక్ ఎక్కడ ఉందో చెప్పడానికే బీజేపీ రోడ్ మ్యాప్ అని పవన్ చెప్పారని అంటున్నారు.

మొత్తానికి చూస్తే బీజేపీని ఒక వైపు కార్నర్ చేయాలన్న ఉద్దేశ్యం కూడా ఆయన మాటల వెనక ఉందని కూడా అంటున్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ వైసీపీని గద్దె దించేలా ఉండాలని ఉంటుందని పవన్ భావిస్తున్నారు. అయితే బీజేపీ ఏపీ  విషయంలో రూపొందించే పొలిటికల్ రోడ్ మ్యాప్ లో మాత్రం ఏపీలో ప్రస్తుతం ఉన్న రెండు పార్టీలలో ఒకటి ఎలిమినేట్ కావాలనే ఉందని అంటున్నారు.

ఏపీలో బలమైన రెండు ప్రాంతీయ పార్టీలలో ఒకటి లేకుండా పోతేనే ఆ ఏర్పడే రాజకీయ శూన్యంలో నుంచి బీజేపీకి అధికారం దక్కుతుంది అన్నది వారి ఆలోచన‌గా ప్రచారం సాగుతోంది. ఈ రెండు పార్టీలలో టీడీపీ ఓటు బ్యాంక్ అయితేనే బీజేపీ వైపు మళ్ళడానికి బాగా ఆస్కారం ఉంటుంది. వైసీపీ ఓటు బ్యాంక్ అయిన ఎస్సీ, ఎస్టీస్, మైనారిటీస్ బీజేపీ వైపు అంత సులువుగా ఇప్పట్లో మళ్లరు. దానికి దీర్ఘకాలం ప్రయత్నం అవసరం.

పైగా ఏపీలో టీడీపీ ఏర్పడకముందు బీజేపీకి ఉన్న ఓటు బ్యాంక్ నే 1983లో సైకిల్ పార్టీ వచ్చి  గ్రాబ్ చేసింది అన్నది కమలనాధుల ప్రధాన ఆరోపణ. సో ఏపీలో టీడీపీకి పొత్తుల రూపేణ కానీ ఇతరత్రా కానీ బలమిచ్చి నిలబెడితే తాము ఎప్పటికీ ఏపీలో పవర్ లోకి రాలేము అన్నది బీజేపీ ఆలోచన.

ఇక దేశంలో ప్రస్తుతం ఉన్న బీజేపీ వేవ్ ని ఉపయోగించుకుని ఏపీలో పవన్ తో కలసి ఏర్పాటు చేసుకున్న కూటమితో నేరుగా వైసీపీని ఢీ కొట్టాలన్నది బీజేపీ రోడ్ మ్యాప్ గా చెబుతారు. మరి ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకుండా ఉండేలా చూస్తామని పవన్ అంటున్నారు.

ఆయన ఆవిర్భావ సభలో చేసిన ప్రసంగం చూసినా, చంద్రబాబు పేరుకు ముందు ఎన్నో విశేషణాలు జోడించి మరీ నమస్కారం చేసిన పద్ధతి చూసినా టీడీపీతో చెలిమికి ఆయన మొగ్గు చూపుతున్నారు అన్నది అర్ధమవుతోంది అంటున్నారు. మరి పొత్తుల పేరిట ఎన్నో కొన్ని సీట్లు తీసుకుని టీడీపీకి పక్క వాయిద్యంగా ఏపీలో బీజేపీ ఉండాలని అనుకోవడంలేదు. మరి అలాంటి బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ లో టీడీపీ ఎలిమినేషన్ ఉంటే పవన్ ఏం చేస్తారు అన్నదే అతి పెద్ద చర్చ.

నిజానికి ఈ విషయాలు అన్నీ పవన్ కి తెలియవు కావని కూడా అంటున్నారు. ఆయన ఏపీలో ప్రస్తుతానికి జగన్ని గద్దె దింపడానికి బీజేపీ తాను పెట్టుకున్న రిజర్వేషన్స్ అన్నీ పక్కన పెట్టి రావాలనే నిన్నటి సభలో ఇండైరెక్ట్ గా చాలా గట్టిగానే  కోరారు అని అంటున్నారు. ఒకవేళ బీజేపీ కనుక అలా చేయకపోతే  మాత్రం పవన్ రూట్ ఆయన స్టాండ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.
Tags:    

Similar News