ఇప్పటం...ఆపటం...ఎవరి తరం....?

Update: 2022-03-14 07:18 GMT
ఇప్పటం. ఈ ఊరు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. కానీ ఇది  ఏపీ రాజధాని ఆమరావతికి  సమీపంలోనే ఉంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఒక గ్రామం ఇప్పటం. అలాంటి ఒక మామూలు ఊరు పేరు ఇపుడు ఏపీలో ఎటు చూసినా పెద్ద ఎత్తున  మారుమోగుతోంది. ఇప్పటం ఇపుడు ఒక చరిత్రకు నాంది కాబోతోంది.

ఇప్పటం  జనసేన ఆవిర్భావ వేడుకలకు వేదికగా మారింది. జనసేన ఇప్పటం గ్రామాన్ని ఎంచుకోవడంతోనే ఇక్కడ జనాలు పొంగిపోతున్నారు. మా ఊరు ఏపీకి తెలిసేలా చేశారు అంటున్నారు. ఇక‌ఇప్పటం సంబరం అంతా ఇంతా కాదు. అక్కడ జనసేనకు వీరాభిమానులు ఉన్నారు. ఇప్పటం గ్రామం మొత్తం తమ ఇంటికి వచ్చిన అథిధులకు మర్యాదలు చేసేందుకు తలమునకలై ఉంది.

అక్కడ గ్రామస్తులు స్వయంగా తయారు చేసిన వేలాది పులిహోర పొట్లాలను జనసైనికులకు పంచుతున్నారు. వారి ఆకలి తీర్చుతున్నారు. ఇది తమ ఊరి వేడుకగా చూస్తున్నారు. గత  కొన్ని రోజులుగా చూస్తే ఇప్పటంలో మరో సంక్రాంతి పండుగ వచ్చినంతగా సంతోషం కనిపిస్తోంది. ఎక్కడ నుంచో వచ్చిన బంధువులకు చేసే రాజ మర్యాదలు ఇపుడు ఇప్పటం ప్రజలు కూడా చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ ఊరికి రాబోతున్నారు అన్న మధురమైన  భావన వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇప్పటంలోని వందల ఎకరాల భూమిలో  సువిశాలమైన చోట ఇపుడు జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటం ఇపుడు అందరికీ ఒకే ఒక రాదారిగా మారింది. ఇప్పటం ఒక గమ్య స్థానం అయింది.

అన్ని దారులూ ఇప్పటం వైపే సాగుతున్నాయి. మార్చి 14న జనసేన పుట్టిన రోజు. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జనసైనికులతో పాటు పవన్ అభిమానులు, కొత్త రాజకీయం పట్ల మోజు పెంచుకుంటున్న వారు అందరూ ఆ వైపుగానే వస్తున్నారు.

ఇక 14వ తేదీ  ఉదయం నుంచే ఈ మార్గమంతా కూడ ఇసుక వేస్తే రాలనంతగా జనసందోహంతో నిండిపోయింది. ఆకాశం చిల్లు పడిందా. నేల ఈనిందా అని నాడు అన్న గారు  ఎన్టీయార్ అన్న మాటలు ఇపుడు ఇప్పటంలో నిజమనే అనిపిస్తున్నాయి.

ఇప్పటం కోసం అంతా ఉరకలు పరుగులు.  ఇప్పటం చేరుకోవాలని అందరి ఆరాటం. ఇప్పటం వైపుగా అలుపెరగని ప్రయాణం, బస్సులు కార్లు, ఆఖరుకు ఏది దొరికితే అది పట్టుకుని జనసేన సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. దాంతో ఈ జన సందోహాన్ని చూసిన వారి నోట ఒకే ఒక మాట వినిపిస్తోంది. ఇప్పటం ఆపటం  ఎవరి తరం అని.
Tags:    

Similar News