ఆర్నెల్లు సినిమాలకు దూరంగా ఉండాలన్న కేటీఆర్.. ఎందుకలా?

Update: 2022-03-15 03:12 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ నోటి నుంచి రోటీన్ కు భిన్నమైన వ్యాఖ్య ఒకటి వచ్చింది. తండ్రికి తగ్గట్లే.. పదునైన ప్రసంగాలతో పాటు.. రాజకీయ ప్రత్యర్థులపై దునుమాడే తీరు కేటీఆర్ సొంతం. అలాంటి ఆయన గతంలో ఎప్పుడూ చేయని వ్యాఖ్య ఒకటి చేశారు. రానున్న ఆర్నెల్ల కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలన్న సూచనను చేశారు. ఎందుకిలా? అంటే దానికి కారణం లేకపోలేదు.

రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ కీలక సూచన చేశారు. ఆర్నెల్లు సినిమాలకు దూరంగా ఉండాలని.. ఫోన్ లో వాట్సాప్.. ఫేస్ బుక్.. ఇన్ స్టాలను బంద్ చేయాలని.. చదువు మీద ఫోకస్ పెట్టాలన్నారు. చేతికి భూషణంగా మారిన ఫోన్ ను ఎంత తక్కువగా వాడితే అంత మంచిదన్న విలువైన సూచన చేశారు.

తల్లిదండ్రుల్ని సంతోష పెట్టేలా ఫ్యూచర్ ప్లాన్ వేసుకోవాలన్న ఆయన మాటలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసే లక్షలాది మంది ఉద్యోగార్థులకు చక్కటి సందేశాన్ని ఇస్తాయని చెప్పక తప్పదు.

తాజా హైదరాబాద్ మహానగర శివారులో ఉన్న మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన కేటీఆర్.. ఈ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు.

ఈ కోచింగ్ సెంటర్ లో ఉచితంగా శిక్షణ ఇస్తారని.. కోచింగ్ సెంటర్లో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని కితాబును ఇచచారు. మూడు నెలల నుంచి నాలుగు నెలల పాటు ఈ కోచింగ్ సెంటర్ ఉచిత సేవల్ని అందిస్తారని చెప్పారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లాసులు జరుగుతాయని.. మధ్యాహ్న భోజనంతో పాటు స్నాక్స్ ను ఇవ్వటం ఈ కోచింగ్ సెంటర్ ప్రత్యేకత.

ఈ సెంటర్ కు అనుబంధంగా ఒక లైబ్రరీని ఏర్పాటు చేయాలన్న సూచన చేశారు మంత్రి కేటీఆర్. అంతేకాదు..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్య.. నిపుణ చానెల్ ను విద్యార్థులు ఉపయోగించుకోవాలని.. యూట్యూబ్ లో కూడా ఈ చానళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
Tags:    

Similar News