కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదా? సోనియా లేకుంటే వచ్చేనా?

Update: 2022-02-19 05:36 GMT
ఒక అద్భుతం జరిగినప్పుడు దాని క్రెడిట్ అంతా ఒకరికే పరిమితం చేయాలనుకోవటం అత్యాశే అవుతుంది. అందునా.. రాజకీయ అద్భుతం చోటు చేసుకున్నప్పుడు.. అదంతా తమ వల్లే జరిగిందన్నట్లుగా చెప్పుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. ఆ అద్భుతం చోటు చేసుకోవటానికి కారణమైన స్టేక్ హోల్డర్లు మొత్తం వరుస పెట్టి వచ్చేస్తుంటారు. టీ మంత్రి కేటీఆర్ మాటల్ని చూసినప్పుడు అలాంటి పరిస్థితే చోటు చేసుకుంటుందని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్ర సాధన మొత్తం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కరి వల్లనే జరిగిందంటూ చెప్పే మాటల్లో అర్థం లేదనే భావన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కీలకభూమిక పోషించారనటంలో తప్పు కాదు. అలా అని క్రెడిట్ మొత్తం ఆయన ఖాతాలో వేసుకోవటం అత్యాశే.

ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోట్లాది మంది రోడ్ల మీదకు వచ్చినా.. భావోద్వేగంతో రగిలిపోయినా.. వేలాది మంది ఆత్మార్పణ చేసుకున్నా.. కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అప్పటి కేంద్రంలోని సర్కారు సానుకూలంగా స్పందించకుండా ఉండి ఉంటే.. తెలంగాణ రాష్ట్ర కల తీరేది కాదన్నది మర్చిపోకూడదు. ఆ మాటకు వస్తే.. కేసీఆర్ చేసిన ఉద్యమాల కంటే కూడా.. తెలంగాణ రాష్ట్ర కలను నిజం కావటానికి తమ ఆత్మబలిదానాలతోనే సాధ్యమవుతుందని తెలంగాణ యువత భావించి.. తమ ప్రాణాల్ని తృణ ప్రాయంగా ఆర్పించుకోవటంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీరియస్ గా పరిగణించాలన్న వాదన ఎక్కువైంది.

ఈ కీలక విషయాన్ని పక్కన పెట్టి.. తెలంగాణ రాష్ట్ర సాధన మొత్తం కేసీఆర్ చలువేనని.. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదనన్నట్లుగా గులాబీ నేతలు చేస్తున్న ప్రచారం కొంత మేర మాత్రమే వాస్తవం తప్పించి.. పూర్తిగా మాత్రం కాదన్నది మర్చిపోకూడదు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కమిట్ మెంట్ ను మర్చిపోలేం. తాను అనుకున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమె ఎంతలా ప్రయత్నాలు చేశారో.. మరెంతకు బరితెగించారో కూడా తెలిసిందే.

లోక్ సభ తలుపులు మూసి.. లైవ్ టెలికాస్ట్ కట్ చేసి మరీ తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని ఆమోదించి.. రాజ్యసభకు పంపిన వైనానికి సంబంధించి ఇప్పటికి ఆమె ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. ఆ మాటకు వస్తే.. ఆమెను ఆ అంశం వెంటాడుతూనే ఉండనుంది. ఎందుకంటే.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో.. ఒక బిల్లు ఆమోదం కోసం లోక్ సభ తలుపులు మూయాల్సి రావటం.. ఇదే తొలిసారి అన్నది మర్చిపోకూడదు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అంతటి కమిట్ మెంట్ ను ఆమె ప్రదర్శించారు కాబట్టే.. తెలంగాణ కల రియాలిటీలోకి వచ్చింది. సోనియాగాంధీ కాకుండా మరెవరూ ఉన్నా కూడా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యేది కాదు. అయితే.. ఇందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొత్తం కేసీఆర్ క్రెడిట్ కింద చెప్పటం వాస్తవాన్ని వక్రీకరించటమే అవుతుంది తప్పించి మరింకేమీ కాదు.

తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ పుణ్యమేనంటూ కేటీఆర్ అండ్ కోలు భారీగా ప్రచారం చేసిన కొద్దీ.. గతానికి సంబంధించిన అంశాలు చర్చకు రావటమే కాదు.. క్రెడిట్ ఎవరెవరికి ఇవ్వాలన్న విషయంపై మరింత లోతైన చర్చ జరగటం ఖాయం. అదే జరిగితే.. కేసీఆర్ కు దక్కాల్సిన క్రెడిట్ కోటాలోనూ కోత పడే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News