మోడీ, చినజీయ‌ర్‌కు ఒకేసారి చెక్ పెట్టిన కేసీఆర్‌

Update: 2022-03-19 15:35 GMT
తెలంగాణ రాజ‌కీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో అధికార టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య పోరు మ‌రో స్థాయికి చేరింది. ఒక పార్టీపై మ‌రొక‌రు పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకే కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తే.. రాష్ట్రంలోని టీఆర్ఎస్ స‌ర్కారుపై ఇక్క‌డి బీజేపీ నేత‌లు కౌంట‌ర్లు వేస్తున్నారు. ఇప్పుడీ క్ర‌మంలో కేసీఆర్ మ‌రో అడుగు ముందుకేసి ప్ర‌ధాని మోడీతో పాటు చిన‌జీయ‌ర్‌కు కూడా ఒకేసారి చెక్ పెట్టార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అప్పుడు పిలిచి..

టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత యాదాద్రి పుణ్య‌క్షేత్రాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ పూనుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ ఆల‌య ప‌నులు పూర్త‌వ‌డంతో పునః ప్రారంభానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఈ నెల 21 నుంచి 28 వ‌ర‌కూ మ‌హా సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. అయితే ఆల‌య పునః ప్రారంభానికి ప్ర‌ధాని మోడీకి ఎలాంటి ఆహ్వానం అంద‌క‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గ‌తంలో ఢిల్లీ వెళ్లి మోడీని క‌లిసిన కేసీఆర్‌.. అప్పుడు యాదాద్రి పునః ప్రారంభోత్స‌వానికి రావాల‌ని ప్ర‌ధానిని ఆహ్వానించారు. కానీ ఇప్పుడు అధికారికంగా మాత్రం ఎలాంటి ఆహ్వానం పంప‌లేదు. ఇటీవ‌ల చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాలే అందుకు కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మోడీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించే దిశ‌గా జాతీయ స్థాయిలో వ్య‌తిరేక శ‌క్తుల‌ను కేసీఆర్ ఒక్క‌తాటిపైకి తెచ్చే ప్రయ‌త్నాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

అప్పుడు వెళ్ల‌లేదు.. ఇప్పుడు పిల‌వ‌లేదు

మ‌రోవైపు చిన‌జీయ‌ర్‌తోనూ కేసీఆర్‌కు దూరం పెరిగింద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో చిన‌జీయ‌ర్ సూచ‌న‌ల‌తోనే ఆల‌యాన్ని పునఃనిర్మించిన ప్ర‌భుత్వం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి మాత్రం ఎలాంటి ఆహ్వానం పంప‌లేదు. స‌మ‌తామూర్తి విగ్ర‌హావిష్క‌ర‌ణ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన మోడీ ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్ హాజ‌రు కాని సంగ‌తి తెలిసిందే. ఆ విగ్రహావిష్క‌ర‌ణ అనంత‌రం మోడీని తెగ పొగిడేస్తూ చిన‌జీయ‌ర్ ప్ర‌సంగించారు. అది కేసీఆర్‌కు న‌చ్చ‌లేద‌ని తెలిసింది.

అందుకే స‌మ‌తామూర్తి విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌కు చివ‌రి వ‌ర‌కూ కేసీఆర్ హాజ‌రు కాలేదు. కేసీఆర్‌కు ఆహ్వానం పంప‌లేదా అని అడిగితే అంద‌రూ ఆహ్వానితులేన‌ని ఎవ‌రినీ ప్ర‌త్యేకంగా పిల‌వ‌లేద‌ని చిన‌జీయ‌ర్ స‌మాధాన‌మిచ్చారు. ఇప్పుడు యాదాద్రి ఆల‌య ఈవో గీత కూడా అదే చెబుతున్నారు.

యాదాద్రి ఆల‌య పునః ప్రారంభోత్స‌వానికి అంద‌రూ ఆహ్వానితులేన‌ని ఎవ‌రినీ ప్ర‌త్యేకంగా పిల‌వ‌లేద‌ని ఆమె స్పష్టం చేశారు. దీంతో చిన‌జీయ‌ర్ను కేసీఆర్ దెబ్బ‌కు దెబ్బ తీశార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News