జ‌గ్గారెడ్డి త‌గ్గేనా? ఆ స‌మ‌స్యే లేదు!

Update: 2022-02-25 06:34 GMT
తెలంగాణ కాంగ్రెస్‌లో సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించి దాన్ని వాయిదా వేసుకున్న ఆయ‌న‌ను బుజ్జ‌గించేందుకు కీల‌క నేత‌లు రంగంలోకి దిగారు. పార్టీలో కొంత కాలంగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో అసంతృప్తితో ఉన్న ఆయ‌న అధిష్ఠానానికి లేఖ రాసి ఇక తాను కాంగ్రెస్ గుంపులో లేన‌ని పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ని స‌ముదాయించేందుకు సీనియ‌ర్ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే మాజీ రాజ్య‌స‌భ ఎంపీ వీహెచ్ ఆయ‌న్ని క‌లిశారు. ఇక తాజాగా  జ‌గ్గారెడ్డితో  సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, ఆ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధ‌ర్‌బాబు, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు.

జ‌గ్గారెడ్డి లేవ‌నెత్తిన అంశాల‌పై అధిష్టానంతో మాట్లాడుతాన‌ని ఈ భేటీ త‌ర్వాత భ‌ట్టి పేర్కొన్నారు. ఆయ‌న కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతార‌ని, రాజీనామా విషయంలో వెనక్కి త‌గ్గార‌నే అనుకుంటున్నామ‌ని భ‌ట్టి అన్నారు. మ‌రోవైపు జ‌గ్గారెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయ‌ర‌ని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.

గ‌తంలో పార్టీ వీడ‌తాన‌ని తాను కూడా అన్నాన‌ని కానీ వెళ్ల‌లేద‌ని ఇప్పుడు జ‌గ్గారెడ్డి కూడా అంతేన‌ని రాజ‌గోపాల్ రెడ్డి తెలిపారు. దీంతో పార్టీకి రాజీనామా విష‌యంలో జ‌గ్గారెడ్డి వెన‌క్కి త‌గ్గుతున్నారేమోన‌న్న వ్యాఖ్య‌లు వినిపించాయి.  కానీ ఆయ‌న మాత్రం అస్స‌లు త‌గ్గేదేలే అంటున్నారు.

రాజీనామాకు బ్రేక్ మాత్ర‌మే వేశాన‌ని త‌ప్పితే వెన‌క్కి త‌గ్గేదే లేద‌ని తాజాగా జ‌గ్గారెడ్డి స్ప‌ష్టం చేశారు. కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం నేప‌థ్యంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. కార్య‌క‌ర్త‌లు అడిగే అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేన‌న్న ఆయ‌న‌.. తాను ఏం చెప్పాల‌ని అనుకుంటున్నానో అది స్ప‌ష్టంగా వెల్ల‌డించాన‌ని పేర్కొన్నారు.

మ‌రోసారి టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిపై ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రేవంత్‌కు ఎలా మాట్లాడాలో కూడా తెలీద‌ని తాను ఎవ‌రి ట్రాప్‌లోనూ ప‌డ‌లేద‌ని జ‌గ్గారెడ్డి చెప్పారు. సంగారెడ్డిలో ల‌క్ష‌మందితో స‌భ పెడ‌తాన‌ని ఆరు నెల‌ల క్రిత‌మే ఠాగూర్‌కు చెప్పాన‌ని కానీ ఇప్ప‌టివ‌ర‌కూ దానిపై ఏం స‌మాధానం రాలేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. క‌చ్చితంగా ల‌క్ష మందితో భారీ బ‌హిరంగ స‌భ పెడ‌తాన‌ని మ‌రోసారి పున‌రుద్ఘాటించారు. 
Tags:    

Similar News