హిమాచల్‌ ప్రదేశ్‌లో గతంలో కంటే తగ్గిన పోలింగ్‌!

Update: 2022-11-13 09:29 GMT
హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు నవంబర్‌ 12న ప్రశాంతంగా ముగిశాయి. 66.58% పోలింగ్‌ నమోదైంది. 2012లో 73.5%, 2017లో 75.57% పోలింగ్‌ నమోదు కాగా ఈసారి పోలింగ్‌ తగ్గడం గమనార్హం.

దట్టమైన మంచుతెరల మధ్య.. గడ్డకట్టించే చలే ఓటింగ్‌ శాతం తగ్గడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే శతాధిక వృద్ధులు కూడా ఓటు వేశారు. ఎన్నికల సంఘం ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో 105 ఏళ్ల నారో దేవి, 103 ఏళ్ల సర్దార్‌ ప్యార్‌సింగ్‌ వంటి శతాధిక వృద్ధులు తమ ఓటు హక్కు వినియోగించుకుని ఓటర్లలో ఉత్సాహం నింపారు.

ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి జైరాం ఠాకుర్‌ పోటీ చేస్తున్న సెరాజ్‌లో అత్యధికంగా 82.22% ఓట్లు పోలయ్యాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పోలింగ్‌ మొదట మందకొడిగా మొదలైంది. ఉదయం 10 గంటల వరకు కేవలం 5% పోలింగ్‌ మాత్రమే జరిగింది.

కాసేపటికి ఎండ పెరగడంతో క్రమేణా పోలింగ్‌ శాతం పెరిగింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా బిలాస్‌పుర్‌లో ఓటు వేశారు. ప్రజాస్వామ్య పండుగగా నిలిచే పోలింగులో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని మోదీ ట్విటర్లో పిలుపునిచ్చారు. మరోవైపు పాత పింఛన్‌ పథకానికే హిమాచల్‌ ఓటు వేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

కాగా 68 అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందినవారే కావడం గమనార్హం. వీరిద్దరూ బీజేపీ తరఫున భారీ స్థాయిలో ప్రచారం చేశారు. అదేవిధంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా దాదాపు రెండు నెలల పాటు అక్కడే మకాం వేశారు.

కాగా ఇప్పటివరకు హిమాచల్‌ ప్రదేశ్‌ వరుసగా రెండుసార్లు గెలిచిన చరిత్ర ఏ పార్టీకి లేదు. అధికారంలో ఉన్న పార్టీని తర్వాత ఎన్నికల్లో ఓడించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ఈ ఆనవాయితీని చెరిపేస్తామని బీజేపీ ఆశలు పెట్టుకోగా, కాంగ్రెస్‌ సైతం అధికారంలోకి వచ్చేది తామేనని విశ్వసిస్తోంది. మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీఎస్పీ వంటి పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి. డిసెంబర్‌ 8న ఫలితాలు వెలువడతాయి.
Tags:    

Similar News