ఏపీ, కేంద్రం మధ్య లేఖాయుద్ధం

Update: 2016-08-17 11:48 GMT
మా రాష్ర్టంలోని వెనుకబడిన జిల్లాలకు మీరు ఇస్తామన్న నిధులు విడుదల చేయండి
- ఏపీ
ఇంతకుముందు మేమిచ్చిన నిధులకు సంబంధించిన ఖర్చు వివరాలు పంపించండి
- కేంద్రం
ఆ ఖర్చుల వివరాలు మీకు ఇచ్చేశాం. కొత్త నిధులు విడుదల చేయండి
- ఏపీ
మీరిచ్చిన వివరాలు సరిపోవు. లెక్కలు తేడాలొస్తున్నాయి. పూర్తి వివరాలిస్తే మళ్లీ నిధులిస్తాం
- కేంద్రం

కేంద్ర, నవ్యాంధ్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలివి.  వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇస్తున్న నిధులకు సంబంధించి ఏపి, కేంద్రం మధ్య జరుగుతున్న లేఖల యుద్ధం సాగుతుందని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.   రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపిలో వెనుకబడిన శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం - చిత్తూరు - కర్నూలు - కడప - అనంతపురం జిల్లాలకు కేంద్రం 700 కోట్లు విడుదల చేసింది. వాటిని ఖర్చుపెట్టిన తీరు, ఏయే పనులకు ఖర్చు పెట్టిన వివరాలకు సంబంధించిన యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు తిరిగి కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. అప్పుడు తిరిగి కొత్తగా నిధులు కేటాయిస్తుంది. కేంద్రప్రభుత్వ నిధుల మంజూరు ప్రక్రియ ఇదేవిధంగా ఉంటుంది. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వానికయినా వర్తిస్తుంది. ఈ నిధుల్లో తమకు రావాల్సినవి విడుదల చేయాలని ఏపీ పదేపదే లేఖల రూపంలో కోరుతుండగా మీరిచ్చిన లెక్కలు కరెక్టుగా లేవని కేంద్రం వాదిస్తోందని సమాచారం.
    
కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత పథకాలకు మళ్లించుకోవడమో - అత్యవసర ఖాతాలకు మళ్లించుకోవడమో, ఇతర పనులను వినియోగించుకోవడమో చేస్తుంటాయి. ఇది సహజంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ జరిగేదే. అందుకే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు - కేంద్రం నిధులివ్వకుండా తమను చిన్నచూపు చూస్తోందని ఆరోపించడం - యుటిలైజేషన్ సర్టిపికెట్లు ఇవ్వనిదే కొత్త నిధులు ఎలా మంజూరు చేస్తామని కేంద్రంలో ఉన్న నేతలు ప్రశ్నించడం చాలా రాష్ట్రాల్లో జరుగుతోంది. ఏపీకి సంబంధించినంత వరకూ కేంద్రం ఇస్తున్న నిధులకు లెక్కలు చెప్పకుండా తమపై బురద చల్లుతున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం - వెనుకబడిన ఏడు జిల్లాలకు నిధులు విడుదల చేయాలని కేంద్రానికి లేఖ రాయగా, ఇంతకుముందు ఇచ్చిన నిధులకు సంబంధించిన పూర్తిస్థాయి లెక్కలు సమర్పించాలని కేంద్రం తిరిగి జవాబు రాసింది. 2014-15 - 2015-16 సంవత్సరానికి జిల్లాకు 50 కోట్లు చొప్పున రెండేళ్లు 700 కోట్లు విడుదల చేసింది. నిజానికి ఈ లేఖల యుద్ధం చాలాకాలంగా కొనసాగుతున్నట్లుగా సమాచారం.
    
తాము ఖర్చుల లెక్కలు సమర్పించామంటూ ఏపీ... లేదులేదు మీరిచ్చిన లెక్కల వివరాలు సరిపోవని, అలాకాకుండా ఏ పనులకు ఎంత ఖర్చు చేశారన్న పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్రం లేఖలు రాస్తుండడం తెలిసిందే.  కేంద్రానికి ఏపీ బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు వివరాలు ఇస్తుండడంతో కేంద్రం ఈ విషయంలో లెక్కలు కావాలంటూ ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రెండు ప్రభుత్వాల మధ్య జరుగుతున్న లేఖల యుద్ధం ఎప్పుడు కొలిక్కి వస్తుందో చెప్పలేని పరిస్థితి..  రాష్ట్ర ప్రభుత్వం పూర్తి లెక్కలు సమర్పిస్తే తప్ప, కొత్త నిధులు విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదని ఆర్ధిక శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Tags:    

Similar News