కన్నీళ్లు కార్పిస్తున్న ఎల్ ఐసీ షేర్లు.. రూ.1.32లక్షల కోట్లు ఆవిరి

Update: 2022-06-14 02:54 GMT
నెలల తరబడి ఎంతో ఆశగా ఎదురుచూసిన ఎల్ ఐసీ షేర్లు ఏడిపిస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద ఐపీవోగా భారీ ఎత్తున సాగిన ప్రచారంతో.. ఎల్ ఐసీ ఐపీవో ఎప్పుడు షురూ అవుతుందన్న ఆశతో ఎదురుచూసి.. ఆత్రంగా అందులో పెట్టుబడులు పెట్టినోళ్లు గగ్గోలు పెట్టేస్తున్నారు.

ఎంతో నమ్మి ఎల్ఐసీలో పెట్టుబడులు పెడితే.. ఇంత దారుణ అనుభవాన్ని మిగులుస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఐసీ షేర్లు లిస్టింగ్ అయిన నాటి నుంచి కింది చూపులే తప్పించి.. పైకి వెళ్లింది లేదు. రోజు రోజుకు కనిష్ఠాన్ని నమోదు చేస్తున్న ఈ షేరు తాజాగా భారీగా నష్టపోయింది. సోమవారం ఒక్కరోజునే ఎల్ఐసీ షేరు విలువ 5.6 శాతం నష్టపోవటం గమనార్హం.

దీంతో లిస్టింగ్ కు వచ్చిన మే 17 నుంచి ఇప్పటివరకు షేర్ వాల్యూ ఏకంగా 29 శాతం పడిపోయింది. దీంతో ఈ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. యాంకర్ ఇన్వెస్టర్ల లాక్ ఇన్ పిరియడ్ ముగిసిన నేపథ్యంలో అమ్మకాలు మరింత పెరిగాయి. తాజాగా పడిపోయిన షేర్ ధరతో.. ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి సంబంధించిన రూ.1.32లక్షల కోట్ల భారీ మొత్తం ఆవిరి అయిపోయిన పరిస్థితి. దీంతో.. ఇందులో ఇన్వెస్టు చేసిన వారి వేదన అంతా ఇంతా కాదన్నట్లుగా మారింది.

ఎల్ ఐసీ ఐపీవోకు వచ్చినప్పుడు.. ఈ షేర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందన్న అంశంపై అందరూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చినోళ్లే. కొందరు నెగిటివ్ వ్యాఖ్యలు చేసినప్పటికీ మెజార్టీ మాత్రం పాజిటివ్ చెప్పటం.. షేర్లు అలాట్ అయితే లాభాలు ఖాయమన్న మాట వినిపించింది. దీంతో.. భారీగా వచ్చిన స్పందనతో ఐపీవో ముగిసింది. ఐపీవోకు ముందు షేర్లు అలాట్ అవుతాయా? లేదా? అన్న టెన్షన్ పెద్ద ఎత్తున కనిపించింది.

అప్పుడు టెన్షన్ పడి.. ఆ తర్వాత షేర్లు అలాట్ కాని వారు తొలుత తీవ్ర నిరాశకు గురైనప్పటికీ తాజాగా మాత్రం వారెంతో హ్యాపీగా ఉంటున్నారు. త్రుటిలో తప్పించుకున్నట్లుగా అదే పనిగా నష్టపోతున్న ఎల్ఐసీ నుంచి తాము తప్పించుకున్నామని వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా ఎదురైన నష్టంతో ఆసియాలో ఈ ఏడాది లిస్టింగ్ అయి అత్యధిక నష్టాలు చవిచూసిన రెండో కంపెనీగా ఎల్ఐసీ నిలిచింది. ఈ ఏడాది బీఎస్ఈ సెన్సెక్స్ 9 శాతం మేర తగ్గగా.. అందుకు రెండింతలు ఎల్ఐసీ షేర్లు నష్టపోయిన పరిస్థితి. తాజా మార్కెట్ అంచనాల ప్రకారం చూస్తే.. ఈ షేరు ధర మరింత క్షీణించే అవకాశం ఉందంటున్నారు. త్రైమాసిక ఫలితాలు పేలవంగా వస్తే మరింత పతనం ఖాయమంటున్నారు. అయితే.. ఎల్ఐసీ షేర్ల విషయంలో ఎలాంటి కంగారు అక్కర్లేదని.. షేర్ హోల్డర్ల వాల్యూ పెంచేందుకు తాము కృషి చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే.. మరీ ఇంత దారుణంగా దెబ్బ పడేంతవరకు కళ్లప్పగించి ఎందుకు చూస్తున్నట్లు? అన్నది అసలు ప్రశ్నగా చెప్పాలి.
Tags:    

Similar News