‘బండి’ దూకుడుపై బీజేపీలో గుస్సా

Update: 2021-04-22 08:49 GMT
తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా సాగుతున్న టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలుస్తోందని ఒక దశలో టీఆర్ఎస్ నాయకులు కూడా ఊహించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల జోరును చూసి కొందరు టీఆర్ఎస్ నుంచి కమలం పార్టీలో కూడా చేరారు. దీంతో ఇక టీఆర్ఎస్ పని అయిపోయిందని కొందరు భావించారు. దీంతో అప్పటి వరకు కామ్ గా ఉన్న కేసీఆర్ ఒక్కసారిగా గర్జించాడు. తన వ్యూహాత్మక ప్లాన్ తో టీఆర్ఎస్ ను ఏ పార్టీ ఢీకొట్టలేదని నిరూపించాడు. వరంగల్, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతో టీఆర్ఎస్ లో మళ్లీ జోష్ కనిపించింది. త్వరలో ఉప ఎన్నిక ఫలితం వెలువడే నాగార్జున సాగర్ లో కూడా టీఆర్ఎస్ గెలుపు ఖాయం అని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని తమ సన్నిహితుల వద్ద అనుకుంటున్నారట. బీజేపీలో చాలాకాలంగా కొనసాగుతున్న నాయకుల అభిప్రాయాలు, నిర్ణయాలు పట్టించుకోకుండా సొంత నిర్ణయాలతో పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి బీజేపీలో కీలకంగా ఉన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ రాకపోవడం ఆ అనుమానాలకు బలం చేకూరుతుంది.

అంతేకాకుండా కొందరు బండి సంజయ్ తీరుపై కొందరు ఢిల్లీ పెద్దలను కలిసినట్లు తెలుస్తోంది. వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థుల విషయంలో వారికి రాష్ట్ర నాయకులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ అభ్యర్థులు వీక్ కాకపోయినా ఒకరు పట్టభద్రులను ఆకట్టుకోలేకపోయారన్నారు. మరొకరు కేవలం ఎస్టీ మెజారిటీ ఓట్లు ప్రామాణికంతో అభ్యర్థిని ఎంపిక చేయడంతో మిగతా ఓట్లు  పడలేదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అమిత్ షా, జేపీ నడ్డా బండి సంజయ్ ని ఢిల్లీకి పిలిపించినట్లు సమాచారం.

రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన నుంచి బండి సంజయ్ దూకుడుగా ప్రవర్తిస్తున్నాడని అయితే రెండు ఎన్నికల వరకే అది పరిమితమైందన్నారు. ఇదే సమయంలో పార్టీలోని వారిని పట్టించుకోకుండా కేవలం విమర్శలు చేయడం వల్ల జనాల్లో కూడా చులకన భావం ఏర్పడిందంటున్నారు. విమర్శలు కాకుండా పార్టీ సమష్టి నిర్ణయాలతో ముందుకెళితే ప్రజల్లో పట్టు ఏర్పడుతుందని, అయితే బండి సంజయ్ మాత్రం ఇది పట్టించుకోవడం లేదంటున్నారు.
Tags:    

Similar News