లాక్‌ డౌన్ 3.0 ఖాయం? ఆధారాలు ఇవే!

Update: 2020-04-30 08:50 GMT
దేశంలో కరోనా కట్టడి కోసం ప్రస్తుతం లాక్ ‌డౌన్‌ 2.0 ను ప్రభుత్వం అమలు చేస్తుంది. మొదట  ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ను ప్రకటించప్పటికీ ..కరోనా కంట్రోల్ లోకి రాకపోవడంతో ..మే 3  వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. అయితే,  మరోసారి లాక్ ‌డౌన్‌ పొడిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న చర్యలే ఆధారాలు అని చెప్పవచ్చు. లాక్ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా  వివిధ రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది చిక్కుకుపోయారు.

ప్రధానంగా వలసకార్మికులు, విద్యార్థులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని స్వస్థలాలకు రప్పించాలంటూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. వారి సూచనలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం లాక్ డౌన్ ‌లో చిక్కుకున్న వారికి ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు చేర్చడంపై కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్‌ డౌన్‌ మార్గదర్శకాల్లో మార్పులు చేస్తూ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల అధిపతులకు  హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఉత్తర్వులు జారీ చేశారు.

లాక్ డౌన్ సమయంలో ఇరుక్కుపోయిన వారి తరలింపులో భాగంగా నోడల్‌ అధికారులను నియమించుకొని, చిక్కుకుపోయిన వారి వివరాలు సేకరించాలని అన్ని  రాష్ట్రాలకు, హోంశాఖ సూచించింది. అందరికీ పరీక్షలు చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతించాలని, తరలింపుపై ఇరు రాష్ట్రాలు సమ్మతి అవసరమని స్పష్టం చేసింది. తరలించే సమయంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే  స్వస్థలాలకు చేరుకున్న తర్వాత అక్కడి స్థానిక అధికారులు మరోసారి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, ఆరోగ్యం బాగాలేని వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని, క్వారంటైన్‌ అవసరం లేని వారిని  గృహాలకే పరిమితం అయ్యేలా సూచిస్తూ.. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది.

ఇక, లాక్‌ డౌన్ పొడగింపు తప్పదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్‌ డౌన్‌ ను మే 3న ఎత్తేయడం మంచిది కాదని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మే 3 తర్వాత లాక్‌ డౌన్‌ ను కొనసాగించినప్పటికీ.. గ్రీన్‌ జోన్లు - ఆరెంజ్ జోన్లలో మరిన్ని సడలింపులు ఇవ్వాలన్న యోచనలో కేంద్రం ఉందని చెబుతున్నారు. అంతేకాదు, ప్రజా రవాణా కూడా ఇప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు అని అయన స్పష్టం చేసారు.  అలాగే మరోవైపు, చాలా రాష్ట్రాలు లాక్‌ డౌన్‌ ను కొనసాగించడమే మేలని ప్రధాని మోడీ తాజాగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో స్పష్టం చేశారు. మొత్తంగా కేంద్రం తాజా నిర్ణయాలు చూస్తుంటే లాక్‌ డౌన్‌ మరోసారి పొడిగించడం ఖాయమని తెలుస్తోంది.
Tags:    

Similar News