లాక్ డౌన్ భ‌యాలుః మ‌ళ్లీ రోడ్డున ప‌డ్డ భార‌తం!

Update: 2021-04-21 16:30 GMT
గ‌తేడాది లాక్ డౌన్ తొలినాళ్ల‌లో దేశ ప్ర‌జ‌లు ఎదుర్కొన్న భ‌యాన‌క సంఘ‌ట‌న‌లను ప్ర‌జ‌లు ఇంకా మ‌రిచిపోలేదు. వ్యాపారాల నుంచి ర‌వాణా వ‌ర‌కు అన్ని సౌక‌ర్యాలూ స్తంభించి పోవ‌డంతో.. వ‌ల‌స జీవులు ఎదుర్కొన్న ఇబ్బందులు క‌న్నీళ్లు పెట్టించాయి. పొట్ట చేత‌బ‌ట్టుకొని వెళ్లిన చోట బ‌తికే అవ‌కాశాలు లేవంటూ.. ల‌క్ష‌లాది మంది సొంతూళ్ల‌కు ప‌య‌న‌మ‌య్యారు. ప్ర‌యాణ సౌక‌ర్యాలు లేక‌పోవ‌డంతో కాలిన‌డ‌క‌నే బ‌య‌ల్దేరారు చాలా మంది. వారిలో చాలా మంది అసువులు బాసారు.

ఆ దారుణ ఘ‌ట‌న‌లు ఇంకా క‌ళ్ల ముందు క‌ద‌లాడుతూనే ఉన్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌రోసారి లాక్ డౌన్ విధించే సూచ‌న‌లు క‌నిపిస్తుండ‌డంతో వ‌ల‌స జీవులు ముందుగానే జాగ్ర‌త్త ప‌డుతున్నారు. మూటాముళ్లె స‌ర్దుకొని సొంతూరు బాట ప‌డుతున్నారు. ముంబై, ఢిల్లీ, రాజ‌స్థాన్, హైద‌రాబాద్ వంటి చోట్ల‌కు వ‌ల‌స‌వెళ్లిన వారంతా స్వ‌గ్రామాల‌కు వెళ్లిపోతున్నారు.

గ‌తేడాది లాక్ డౌన్ ఏ విధంగా అమ‌లు చేశారో జ‌నాల‌కు బాగానే గుర్తుంది. కేంద్రం ప్ర‌క‌ట‌న‌తో మొద‌టి రెండు రోజులు మాత్ర‌మే లాక్ డౌన్ ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ.. అది అలాగే ముందుకు సాగుతూ వెళ్లింది. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌ని భ‌య‌ప‌డుతున్నారు చాలా మంది. ఇప్ప‌టికే.. ఢిల్లీ, మ‌హారాష్ట్ర వంటి చోట్ల లాక్ డౌన్ కొన‌సాగుతోంది. చాలా రాష్ట్రాలు నైట్ క‌ర్ఫ్యూ కొనసాగిస్తున్నాయి. దీంతో.. ఈ ప‌రిస్థితులు పూర్తిస్థాయి లాక్ డౌన్ దిశ‌గా మ‌ళ్లుతున్నాయ‌నే భ‌యాలు జ‌నాల్లో నెల‌కొన్నాయి.

ఇక‌, వాస్త‌వ ప‌రిస్థితులు కూడా ఏమంత ఆశాజ‌న‌కంగా లేవు. దేశంలో ల‌క్ష‌లాది కేసులు, వేలాది మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో అంచ‌నాల‌కు మించి వేలాదిగా కేసులు పెరుగుతున్నాయి. ఈ ప‌రిస్థితి ఎప్పుడు అదుపులోకి వ‌స్తుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేని దుస్థితి. అందుకే.. ఇక‌, స‌మ‌యం మించ‌కుండా స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోవ‌డ‌మే శ్రేయ‌స్క‌రమ‌ని నిర్ణ‌యించుకుంటున్న వ‌ల‌స కూలీలు.. బ‌తుకుజీవుడా అంటూ త‌ర‌లిపోతున్నారు.
Tags:    

Similar News