లాక్ డౌన్ కొనసాగింపు..మందు బాబుల గుండెల్లో రైళ్లే

Update: 2020-04-11 15:41 GMT
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పై సాగుతున్న పోరును మరింత కాలం పాటు కొనసాగించాలన్న దిశగా అడుగులు పడుతున్న వేళ.... దేశంలోని అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తుండగా... ఒక్క వర్గంలో మాత్రం తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆ వర్గమేదంటే... మందుబాబుల వర్గమే. అసలే 20 రోజులుగా మద్యం లేక అల్లాడిపోతున్న మందుబాబులు... తాజాగా లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు కొనసాగించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న వేళ... బేజారెత్తిపోతున్నారు. లాక్ డౌన్ కొనసాగింపునకు ప్రకటన వస్తే.. మందు బాబుల గుండెల్లో నిజంగానే రైళ్లు పరుగెత్తడం ఖాయమేనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసమంటూ దేశం మొత్తం లాక్ డౌన్ అమల్లోకి రాగానే... అన్ని రకాల వ్యాపారాలు బంద్ కాగా... మద్యం విక్రయాలు కూడా బందైపోయాయి. ఈ క్రమంలో చుక్క లేనిదే నిద్రపట్టని మందుబాబులంతా పిచ్చోళ్లైపోయారు. తాగుడుకు బానిసలుగా మారిన వారి పరిస్థితి అయితే... మరింత దారుణంగా ఉందనే చెప్పాలి. మందు లేక కొందరు పిచ్చోళ్లైపోతే... మరికొందరు ఏకంగా ఎర్రగడ్డ ఆసుపత్రికి చేరారు. మొత్తంగా లాక్ డౌన్ మందుబాబులను బాగానే ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. అయితే తొలుత ప్రకటించిన లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో ఎలాగోలా నాలుకను కంట్రోల్ పెట్టుకున్న మంందుబాబులు ఏప్రిల్ 14 కోసం కళ్లు కాయలు కాసేలా వేచి చూశారు. ఆ ఘడియ సమీపిస్తున్నదన్న భావనతో మందుబాబులంతా ఎప్పుడెప్పుడు లాక్ డౌన్ ముగుస్తుందా? ఎప్పుడెప్పుడు కరువుదీనా మందేద్దామా? అన్న చందంగా హుషారు ప్రదర్శించారు.

ఇలాంటి కీలక సమయంలో దేశంలో కోవిడ్-19 వ్యాప్తి ఇంకా వేగంగానే సాగుతున్న తరుణంలో మరింత కాలం పాటు లాక్ డౌన్ పొడిగించక తప్పదన్న కోణంలో కేంద్రం ఆలోచనలో పడింది. అందులో భాగంగా ఇప్పటికే లాక్ డౌన్ పొడిగింపుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన కేంద్రం... శనివారం దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చలు జరిపింది. ఈ భేటీలో మెజారిటీ రాష్ట్రాల సీఎంలు లాక్ డౌన్ పొడిగింపునకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా లాక్ డౌన్ పొడిగింపునకు దాదాపుగా సిద్దమైపోయింది. ఈ వార్తలను టీవీల్లో చూసినంతనే మందుబాబులు చిత్తైపోయారు. ఇప్పటికే 20 రోజుల పాటు నాలుకను ఎలాగోలా కంట్రోల్ చేసుకున్న తాము మరో రెండు వారాల పాటు అంటే.. ఈ నెలాఖరు దాకా మందు లేకుండానే ఉండాలా? అంటూ తలలు పట్టుకున్నారట. అంతేకాకుండా ఇప్పటికే మందు లేక చాలా మంది ఆస్పత్రి పాలైతే.. మరో 14 రోజుల పాటు మందు లేకపోతే.. ఇంకెందరు ఆస్పత్రిపాలవుతారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News