సంచలనం..బాబు - లోకేశ్ లపై లోకాయుక్తకు కంప్లైంట్!

Update: 2019-09-26 16:32 GMT
ఈ వార్త నిజంగానే సంచలన వార్తే. ఇప్పటిదాకా తెలుగు నేల రాజకీయాల్లో మచ్చ లేని నేతనంటూ చెప్పుకుంటున్న టీడీపీ అధినేత - ఏపీ మాజీ సీఎం - ఏపీ అసెంబ్లీలో ప్రస్తుత విపక్ష నేత నారా  చంద్రబాబునాయుడితో పాటు ఆయన కుమారుడు - పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఓ ఫిర్యాదు దాఖలైంది. అది కూడా ఏపీ లోకాయుక్తకు ఈ కంప్లైంట్ వెళ్లడం చూస్తుంటే... త్వరలోనే ఈ పిటిషన్ పై విచారణకు కూడా ఆదేశాలు వెలువడే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ పిటిషన్ ఇప్పుడు ఏపీలో పెను సంచలనం రేపే అవకాశాలున్నాయని చెప్పక తప్పదు.

ఈ పిటిషన్ ఏమిటి? ఎవరు వేశారు? అన్న వివరాల్లోకి వెళితే... బీసీ సంఘాలకు చెందిన డేరంగుల ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి ఏపీ లోకాయుక్తలో చంద్రబాబు - లోకేశ్ లపై ఫిర్యాదు చేశారు. గడచిన ఐదేళ్ల పాటు ఏపీలో అధికారం చెలాయించిన చంద్రబాబుతో పాటు ఆయన కేబినెట్ లో కీలక మంత్రిగా - అధికార పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన నారా లోకేశ్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నది ఫిర్యాదుదారుడి వాదన. చంద్రబాబు అధికారంలో ఉండగా... బాబు - లోకేశ్ లే కాకుండా బాబు కేబినెట్ లోని మంత్రులు - టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచుకున్నారని కూడా ఉదయ్ ఆరోపించారు. ఇసుకలో దోపిడీ - రాజధాని నిర్మాణంలో అక్రమాలు - పోలవరం అవకతవకల్లో వీరి హస్తం ఉందని తెలిపారు. ప్రజల ధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని - వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. టీడీపీ నేతల అవినీతి సంపాదనను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కూడా ఉదయ్ డిమాండ్ చేశారు. 

ఈ వాదనలో నిజమెంత అన్న విషయాన్ని పక్కనపెడితే... లోకాయుక్తకు అందిన ఫిర్యాదులపై విచారణ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో... ఇప్పుడు బాబు, లోకేశ్ లపైనా విచారణ జరగడం ఖాయమేనా? అన్న దిశగా విశ్లేషణలు మొదలయ్యాయి. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మంత్రులు - ముఖ్యమంత్రి స్థాయి నేతలపైనా లోకాయుక్త పరిధిలోనే విచారణ జరిగిన సంగతి తెలిసిందే. అసలు కర్ణాటకలో రాజకీయ నేతల అవినీతిపై విచారణ చేపట్టిందే లోకాయుక్త కదా. మరి ఇప్పుడు కూడా మాజీ సీఎం చంద్రబాబు, ఆయన హయాంలో మంత్రులుగా కొనసాగిన వారితో పాటు మాజీ సీఎం కొడుకుగానే కాకుండా మాజీ మంత్రిగా - నాటి అధికార పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చక్రం తిప్పిన లోకేశ్ లపై లోకాయుక్తకు ఫిర్యాదు వస్తే... దానిపై విచారణ జరిగే అవకాశాలే ఎక్కువ అన్న దిశగా ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.
Tags:    

Similar News