జ‌గ‌న్ పాల‌న రివ‌ర్స్‌.. తిర‌గ‌బడండి.. ప్ర‌జ‌ల‌కు లోకేష్ పిలుపు

Update: 2022-03-30 12:39 GMT
ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచడాన్ని తీవ్రంగా నిర‌సిస్తున్న‌ట్టు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా  లోకేష్ అన్నారు. అప్ప‌టికే అనేక ధ‌ర‌లు పెరిగిపోయి.. ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్న నేప‌థ్యంలో .. ఇప్ప డు విద్యుత్ ధ‌ర‌ల బాదుడుతో..ప్ర‌జ‌ల న‌డ్డి విరుస్తున్నాడంటూ.. సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర‌స్తాయిలో విరుచుకుప డ్డారు. ``జ‌గ‌న్‌రెడ్డి మాట ఇచ్చాడంటే, దానికి రివ‌ర్స్ చేస్తాడంతే! మాట త‌ప్పుడుకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌, మడ‌మ తిప్పుడుకి ఐకాన్ జ‌గ‌న్‌.`` అని లోకేష్ మండిప‌డ్డారు.

``సీఎం ప‌ద‌వి కోసం జ‌గ‌న్ రెడ్డి తొక్క‌ని అడ్డ‌దారి లేదు. మోస‌పు మాట‌ల‌కి లెక్కేలేదు. ఓట్ల కోసం వేసిన బాబాయ్‌పై గొడ్డలివేట్లు క‌ళ్ల‌ముందు ఆర‌ని నెత్తుటి మ‌ర‌క‌లుగా మ‌న‌కి క‌నిపిస్తూనే వున్నాయి. నాడు విప‌క్ష‌నేత‌గా పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు బాదుడే బాదుడంటూ రాగం తీసిన జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వాధినేత‌గా దేశంలో అతి ఎక్కువ పెట్రోల్‌, డీజిల్ రేట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం పేరిట‌ రికార్డు నెల‌కొల్పారు. క‌రెంటు చార్జీలు బాదుడే, బాదుడంటూ నాడు జ‌గ‌న్ తీసిన దీర్ఘాల స్థాయిలోనే మూడేళ్ల‌లో కరెంటు చార్జీలు భారీగా పెంచి జ‌నానికి షాక్ కొట్టించారు``  అని లోకేష్ విరుచుకుప‌డ్డారు..

కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొచ్చి, ఏపీలో సామాన్యులపై జగన్ సర్కార్ మరో పిడుగు వేసిందని అన్నారు. 30 యూనిట్ల వారికి యూనిట్‌కు 45 పైసలు పెంచారు. 31 నుంచి 75 యూనిట్ల వారికి యూనిట్‌కు 91 పైసలు పెంచారు. 76 నుంచి 125 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.40 పెంచారు. అలాగే 126 నుంచి 225 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.57  పెంచగా,  226 నుంచి 400 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.16 పెంచారు.  400 యూనిట్లపైన వారికి యూనిట్‌కు 55 పైసలు పెంచ‌డం ఏ రేంజ్ బాదుడో జ‌గ‌న్‌రెడ్డే చెప్పాలని లోకేష్ దుయ్య‌బ‌ట్టారు.

ఒక ఏడాదిలో జ‌గ‌న్‌రెడ్డి ఇచ్చే అన్నిప‌థ‌కాల డ‌బ్బూ ఏడాది క‌రెంటు బిల్లుల‌కే స‌రిపోనంత స్థాయిలో పెర‌గ‌నుండ‌డం ఏ బాదుడో సీఎం చెప్పాలని లోకేష్ ప్ర‌శ్నించారు.  టీడీపీ హ‌యాంలో ఉచిత విద్యుత్ ఇస్తుంటే అపోహ‌లు సృష్టించ‌డంపైనా, 24 గంట‌లు నాణ్య‌మైన క‌రెంటు ఇస్తే ఇవ్వ‌లేద‌ని చెప్పిన అబ‌ద్ధాల‌పైనా, క‌రెంటు చార్జీలు పెంచ‌క‌పోయినా బాదుడే బాదుడంటూ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డంపై నా జ‌గ‌న్‌రెడ్డి క్ష‌మాప‌ణలు చెప్పాలని లోకేష్ నిల‌దీశారు.

ఉచిత విద్యుత్‌పై మాట త‌ప్పి మోటార్ల‌కు మీట‌ర్లు బిగించినందుకు రైతులు.. క‌రెంటు చార్జీలు పెంచి మోయ‌లేని భారం మోపినందుకు ప్ర‌జ‌లు ఈ ప్ర‌భుత్వంపై తిరుగుబాటు చేయాల‌ని పిలుపునిచ్చారు.

మిగులు విద్యుత్‌తో టీడీపీ ప్ర‌భుత్వం అప్ప‌గించిన విద్యుత్ ఉత్ప‌త్తిని..లోటు విద్యుత్ స్థాయికి దిగ‌జార్చి.. కొర‌త‌తో కోత‌లు అమ‌లు చేస్తున్నార‌ని.. లోకేష్ దుయ్య‌బ‌ట్టారు. టీడీపీ పాల‌న‌లో అమ‌లైన సంస్క‌ర‌ణ‌ల‌తో దేశంలోనే ఆద‌ర్శ రాష్ట్రంగా నిలిచిన ఏపీ విద్యుత్ రంగాన్ని జ‌గ‌న్‌రెడ్డి త‌న విధ్వంస‌క విధానాల‌తో సంక్షోభంలో ప‌డేసినందుకు జ‌గ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రజల్ని మ‌న్నించ‌మ‌ని ప్రాధేయ‌ప‌డాలని దుయ్య‌బ‌ట్టారు. విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ప్రజలకు వేసవి షాక్ ఇచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.
Tags:    

Similar News