లోకేష్ కొత్త స్కెచ్‌

Update: 2015-08-30 10:40 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో యువనేతల శకం ప్రారంభం కాబోతోంది. టీడీపీలో ఉన్న యువ నేతలంతా... రాజకీయ తెరంగేట్రం చేసేందుకు సిద్దం అవుతున్నారు. చినబాబు లోకేష్ సారథ్యంలో యంగ్‌ టీం రెడీ అవుతూ టీడీపీలో సమాంతరంగా ఈ తరం ఎదుగుతోంది. 2019 ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్దమవుతోంది. టీడీపీలో సీనియర్లకు వయసు మీద పడటంతో... వారివారి పిల్లలను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. పార్టీలోని సీనియర్ల తనయులందరూ... 2019 ఎన్నికలే టార్గెట్‌ గా బరిలో నిలిచి విజయం సాధించుకునేందుకు ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. స్థిరమైన రాజకీయ పునాది వేసుకునేందుకు తండ్రుల దగ్గర నుంచి తర్ఫీదు పొందుతున్నారు. వీరంతా లోకేష్ మార్గ‌ద‌ర్శ‌కంలో టీడీపీని భ‌విష్య‌త్ లో లీడ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

చిత్తురు జిల్లాలో సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు గాలి జగదీశ్‌ కూడా పొలిటికల్ కెరీర్‌ ను స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. 2014 ఎన్నికల్లోనే నగరి స్ధానం నుండి జగదీశ్ పోటీకి దిగాలనీ చూసినా... అధినేత ఆదేశాల మేరకు నిర్ణయాన్ని మార్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుండి తన కుమారుడిని రంగంలోకి దింపి గెలిపించుకొవాలని ముద్దుకృష్ణమ చూస్తున్నారు. టీడీపీ యువనేతల్లో పలువురు ఇప్పటికే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండగా... మరికొందరు... ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్నారు. రాష్ర్ట అట‌వీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి... చిత్తురు జిల్లా రాజకీయల్లో క్రియాశీలకంగా మారేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తన ప్రాబల్యం పెంచుకునేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్దం చేసుకుంటున్నారు. దివంగత నేత డికే ఆదికేశవులు నాయుడు కుమారుడు డికే శ్రీనివాస్ కూడా చిత్తూరు ఎమ్మెల్యే స్ధానానికి పోటీచేసేందుకు సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ తల్లి... సత్యప్రభ చిత్తురు ఎమ్మెల్యేగా ఉండగా...రానున్న రోజుల్లో ఆ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని శ్రీనివాస్‌ భావిస్తున్నారు.

అనంత రాజకీయల్లో తన శఖం ప్రారంభించేందుకు సిద్దమవుతున్నాడు పరిటాల శ్రీరామ్. తండ్రి పరిటాల రవి డైనమిజాన్ని పునికిపుచ్చుకున్న ఈయన... తనను నమ్ముకొన్న వారిని చేరదీస్తూ... ఇమేజ్ బిల్డప్ చేసుకున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఉంటూ ప్రజా సమస్యలపై దృష్టిపెడుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి పొటీ చేసేందుకు శ్రీరామ్ సిద్దం అవుతున్నారు. అనంతపురం జిల్లాకే చెందిన మరో నేత జేసి దివాకర్ రెడ్డి. తన తనయుడు జేసీ పవన్‌ కుమార్ రెడ్డి సైతం రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. తండ్రి ఇమేజ్‌ తో... తనకు పట్టున్న ప్రాంతాల్లో ప్రాబల్యం పెంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో... తాడిపత్రి ఎమ్మెల్యే స్ధానానికి గానీ అనంతపురం ఎంపీ స్ధానానికి గానీ పవన్‌ పొటీ చేసే అవకాశం కన్పిస్తోంది.

ఇక స్పీకర్ కొడెల శివప్రసాద్ కుమారుడు కొడెల శివరాం సైతం... ప్రజాసేవలో దూసుకుపొతున్నారు. తన తండ్రిలాగే గుంటూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా ఉంటూ... ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. రానున్నరోజుల్లో నర్సరావుపేట నియోజకవర్గంనుంచి శివరాం పొటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా విషయానికొస్తే...పార్టీ సీనియర్ నేత కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ కూడా రానున్న ఎన్నికల్లో గెలుపుకోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు.

ఇక ఉత్తరాంధ్ర రాజకీయాల్లో యువనేతల జోరు కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. దివంగతనేత ఎర్రన్నాయుడు కుమారుడు కింజారపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఎన్నికై తన వాక్ చాతుర్యంతో మన్ననలు పొదుతుండగా.... మరో సీనియర్ నేత మంత్రి అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కూడా రాజకీయ ఆరంగేట్రానికి సిద్దమయ్యారు. ఈ మేర‌కు తండ్రికి సంబంధించిన నియోజ‌క‌వ‌ర్గం ప‌నుల‌ను చూసుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు మాజీ ఎంపీ బోళ్ళ బుల్లిరామయ్య మనమడు... బోళ్ళ రాజీవ్ కూడా ప్రజాక్షేత్రంలో తనదైన ముద్రవేసుకుంటున్నారు. 2014 లోనే పోటీకి యోచించి లోకేష్ టీం లో ఉన్నప్పటకీ రాష్ట్ర విభజన నేపధ్యంలో పొటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక కడప నుంచి వరదరాజులు రెడ్డి మనమడు, కర్నూలు నుంచి కేఈ కృష్ణమూర్తి కుమారుడు, కృష్ణా నుంచి దేవినేని కుటుంబం నుంచి వచ్చిన చంద్రశేఖర్‌ ట్రైనింగ్ పూర్తిచేసుకొని రాజకీయ తెరంగేట్రానికి రెడీగా ఉన్నారు.

తన తల్లితండ్రుల ఇమేజ్ కొంత... తమ టాలెంట్ మరికొంత...వెరసి పొలిటికల్‌ కెరీర్ బిల్డప్ చేసుకునే పనిలోపడ్డారు యువ లీడర్లలంతా. 2019 ఎలక్షన్‌ వార్‌కు ఈ వారసులు రెడీ అవుతున్నారు. స్ట్రాంగ్‌ బేస్‌తో తమ పోలిటికల్‌ ఇన్నింగ్స్‌ ను స్టార్ట్‌ చేసేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంటున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ... గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.. రాజీకీయ రంగంలో రాటుదేలేందుకు తర్ఫీదు పొందుతున్నారు. మొత్తానికి భవిష్యత్ టీడీపీ మొత్తం యువనాయకులతో నిండిపోనుంది. ప్రస్తుతానికి ట్రైనింగ్ బాగానే సాగుతున్నప్పటకీ పార్టీకి పెద్ద బ‌లంలా మారిన సీనియ‌ర్లు, కొత్త‌గా వ‌స్తున్న‌ యువ‌ర‌క్తం మ‌ధ్య స‌మ‌న్వ‌యంతో చిన‌బాబు ఎలా ముందుకువెళ‌తారో చూడాలి మ‌రి.
Tags:    

Similar News