బీజేపీ గెలవలేదంటున్న శివసేన!

Update: 2019-05-07 16:50 GMT
భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు అని అన్నారు శివసేన ముఖ్య నేత సంజయ్ రౌత్. ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సొంతంగా మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని ఈ సీనియర్ పొలిటీషియన్ అంచనా వేశారు. శివసేన- భారతీయ జనతా పార్టీలు ఈ సారి పొత్తుతోనే పోటీ చేస్తూ ఉన్నాయి. అయినా భారతీయ జనతా పార్టీ విజయం మీద సేనకు నమ్మకం కలగడం లేదు.

బీజేపీ మినిమం మెజారిటీ స్థాయి ఎంపీ సీట్లను పొందే అవకాశం లేదని రౌత్ తేల్చి చెప్పారు. అయితే ఎన్డీయే రూపంలో మళ్లీ బీజేపీకే అధికారం దక్కుతుందని ఆయన అన్నారు. ఇలా తమ మిత్రపక్ష పార్టీ సొంతంగా గెలవలేదు  అని అంటూనే.. తామంతా కలిసి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటూ చెప్పుకొచ్చారు ఈ మహారాష్ట నేత. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోయినా ఎన్డీయే రూపంలో తమ కూటమి సీట్లు రెండువందల ఎనభైని దాటేస్తాయని రౌత్ వ్యాఖ్యానించారు.

వాస్తవానికి శివసేన కోరుకుంటున్నది కూడా ఇదే. భీజేపీ సొంతంగా మెజారిటీని తెచ్చుకుంటే తమ మాటను వినదని సేనకు బాగా తెలుసు. బీజేపీకి దశాబ్దాలుగా మిత్రపక్షంగా కొనసాగుతూ ఉంది శివసేన. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో కమలం పార్టీ సొంతంగా మెజారిటీ  తెచ్చుకోవడంతో శివసేనను  ఆ పార్టీ అస్సలు ఖాతరు చేయలేదు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలన్న ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నాలకు  కూడా బీజేపీ చెక్ పెట్టింది. దీంతో బీజేపీ తీరుతో చాన్నాళ్లుగా అసహనంతో ఉంది సేన. అయితే తప్పక ఆ పార్టీతో పొత్తును కొనసాగిస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు శివసైనికులు. బీజేపీకి సొంతంగా మెజారిటీ దక్కకపోతే అప్పుడు  శివసేన లాంటి పార్టీలు కమలాన్ని  చేతిలోకి తీసుకుని ఆడించగలవు!


Tags:    

Similar News