సుహాసినిని నిల‌బెట్టి టీడీపీ పప్పులో కాలేసింది!

Update: 2018-11-20 07:38 GMT
కూక‌ట్‌ ప‌ల్లిలో టీడీపీ అభ్య‌ర్థిగా నంద‌మూరి సుహాసిని బ‌రిలో దిగ‌డంపై అక్క‌డి సిట్టింగ్‌ ఎమ్మెల్యే - టీఆర్ ఎస్ అభ్య‌ర్థి మాధ‌వ‌రం కృష్ణారావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సుహాసినికి టికెట్ ఇచ్చి టీడీపీ పప్పులో కాలేసింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆమెపై త‌న విజ‌యం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

సుహాసిని త‌న సోద‌రి వంటి వార‌ని కృష్ణారావు పేర్కొన్నారు. ఆమె ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో రాజ‌మండ్రి స్థానానికి పోటీ చేస్తే గెలిచి ఉండేవార‌ని జోస్యం చెప్పారు. కూక‌ట్‌ ప‌ల్లిలో మాత్రం ఆమెకు ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌ని అన్నారు. గ‌త ఐదేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గంలో తాను ఎన్నో అభివృద్ధి ప‌నులు చేశాన‌ని.. త‌న అభివృద్ధి మంత్ర‌మే త‌న‌కు విజ‌యాన్ని క‌ట్ట‌బెడుతుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.

సాధార‌ణంగా ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీల అభ్య‌ర్థులు ప‌ర‌స్ప‌రం తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతుంటారు. అందుకు భిన్నంగా కృష్ణారావు సుహాసినిపై కాస్త మెత‌క వైఖ‌రితోనే స్పందించారు. వ్య‌క్తిగ‌తంగా ఆమెపై ఎలాంటి ఆరోప‌ణ‌లు గుప్పించ‌లేదు. ఇందుకు ఓ కార‌ణ‌ముంది. గ‌తంలో కృష్ణారావు టీడీపీలో ప‌నిచేశారు. నంద‌మూరి కుటుంబంతో ఆయ‌న‌కు మంచి అనుబంధం ఉంది. అందుకే సుహాసినిని త‌న సోద‌రిగా అభివ‌ర్ణించారు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగ‌లేదు. అదే స‌మ‌యంలో త‌న విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేశారు. దీంతో సుహాసిని పోటీ పై ఆయ‌న‌ స్పంద‌న పట్ల ఇటు టీఆర్ ఎస్ అభిమానులు - అటు టీడీపీ మ‌ద్ద‌తుదారులు సంతృప్తితో ఉన్నారు. మ‌రి కృష్ణారావు వ్యాఖ్య‌ల‌పై సుహాసిని ఎలా స్పందిస్తారు? ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డే కొద్దీ ఆయ‌న వ్యాఖ్య‌ల్లో ప‌దును పెరుగుతుందా? అనే విష‌యాలు ప్ర‌స్తుతం ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.
Tags:    

Similar News