పవన్ క్రిస్మస్ గ్రీటింగ్ పోస్టుపై సినీ నటి సంచలన వ్యాఖ్యలు

Update: 2021-12-25 12:30 GMT
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని పవర్ స్టార్ కమ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోస్టు చేసిన ట్వీట్ పై సినీ నటి మాధవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్.. మీరు మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారా? అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సరిగా లేవనే చెప్పాలి. ఎందుకంటే.. పవన్ సతీమణి క్రిస్టియన్ అయినప్పటికీ.. ఆయన మాత్రం అసలుసిసలు హిందువుగానే వ్యవహరిస్తుంటారు.

గుళ్లకు వెళ్లటం.. పూజలు చేయటం లాంటివి చేస్తుంటారు. పండుగ సందర్భంగా పెట్టే పోస్టుల్లోని సందేశాన్ని పట్టుకొని ఈకకు ఈక.. పీకకు పీక అన్నట్లుగా వేరు చేయటం సబబు కాదనే చెప్పాలి. ఆ మాటకు వస్తే.. మాధవిలత ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ అగ్రనేత కమ్ ప్రధాని మోడీ మెసేజ్ లోనూ ఇలాంటి పదాలు ఉండొచ్చు.

అంతమాత్రాన.. మతమార్పిళ్లను ప్రోత్సహించేలా సందేశాలు ఇస్తారా? అంటూ విరుచుకుపడాల్సిన అవసరం లేదు. పవన్ తో పాటు.. పవన్ సోషల్ మీడియా ఖాతాల్ని హ్యాండిల్ చేసే వారికి ఆమె వార్నింగ్ ఇచ్చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని పోస్టు పెట్టాలని పేర్కొన్నారు. మాధవి లత ఇంతలా చెలరేగిపోవటానికి పవన్ కల్యాణ్ పేరుతో పెట్టిన క్రిస్మస్ సందేశంలో ఏముందన్నది చూస్తే..

‘క్రిస్మస్ శుభాకాంక్షలు’

'దైవం మానుష రూపేణా'... మానవునిగా జన్మించి.. మానవులను ప్రేమించి.. మానవులను జాగృతపరచడానికి దివికి ఏతెంచిన దైవపుత్రుడు ఏసుక్రీస్తు. ఆ అవతార పురుషుని జన్మదినం మానవాళికి గొప్ప పర్వదినం. ఏసు నామమును స్మరిస్తూ, ఏసు ప్రభువు పట్ల అచంచల విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరికీ నా తరపున, జనసేన శ్రేణుల తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు.

సర్వ ప్రాణుల పట్ల కరుణ, ప్రేమ, సేవాభావం చూపాలని క్రీస్తు చేసిన బోధనలు ఎల్లవేళలా ఆచరణీయం. క్షమ, దయ కలిగి ఉండడమే క్రీస్తుపై భక్తికి తార్కాణం. దుర్బుద్ధితో ఉన్నవారికి సద్బుద్ధిని, ఆశ్రిత జనులకు సుఖసంతోషాలను ప్రసాదించమని ఆ కరుణామయుణ్ణి ప్రార్ధిస్తున్నాను’.. అంటూ తెలుగుతో పాటు.. ఇంగ్లిషు.. హిందీ భాషల్లో పోస్టు పెట్టారు.

ఈ పోస్టుపై స్పందించిన మాధవీలత పవన్ కు భారీ కౌంటర్ ఇచ్చారు. ఆమె చేసిన వ్యాఖ్యల్ని ఆమె మాటల్లోనే చూస్తే..

- పవన్ కళ్యాణ్ గారు..క్రిస్మస్ విషెస్ చెప్పండి.. నమ్మినవారికి విషెస్ అని చెప్పండి ఇంకా సంతోషం... మానవాళికి లాంటి పెద్దమాటలు ఎందుకండి?

- మీరే మతమార్పిడిలకు ఎంకరేజ్మెంట్ చేసేలావుంది మీ పోస్ట్..విషెస్ పెట్టండి చాలు. బైబిల్‌ని మనమే బోధించనక్కర్లేదు. అక్కడ ఎవరూ దేవుడు లేరు. రెస్పెక్ట్ ఇద్దాం అంతవరకే.

- మీరు చెప్పిన విషెస్ తప్ప మీరు రాసిన కంటెంట్ నాకు నచ్చలేదు. సర్వ ప్రాణుల పట్ల అని ఏసు చెప్పలేదు. ఆయన చెప్పారని నేనూ మొన్నటిదాకా మీలాగే నమ్మా.. కానీ, యూదుల వరకే ఆయన ప్రేమ. మనం యూదులం కాదు.

- మీ పేజి మెయిన్‌టేన్ చేస్తున్నవాళ్లు కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకోవడం మంచిది.

- మొన్న మీరు కూడా బైబిల్ గురించి గొప్పగా చెప్పారు. అంత గొప్పేంలేదండీ. ఫ్లోలో చెప్పి మీరు కూడా మతమార్పిళ్లకు కారణం అవ్వొద్దు. చాలా బాధగా ఉంది నాకు.

- మీ పోస్టులో విషెస్ కంటే మతమార్పిళ్లకు సపోర్టు చేస్తున్నట్టు వుంది. ఒక హిందువుగా మీ పోస్టు పట్ల విచారం వ్యక్తంచేస్తున్నాను
ఇలా తనకు తోచిన వ్యాఖ్యల్ని వినిపించిన మాధవీలత పోస్టును చూస్తే.. ఆమె ఈ మధ్యన రంధ్రాన్వేషణను ఎక్కువగా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న చందంగా.. తన మనసులో ఏదో పెట్టుకొని.. పవన్ మాటల్ని విని తనకు తానుగా ఏదో ఊహించుకోవటం ఏ మాత్రం సబబు కాదు.

చూస్తుంటే.. ఇప్పటివరకు పవన్ ను విమర్శించటమో.. తప్పు పట్టటం ద్వారా పేరును తెచ్చుకోవటం.. పాపులర్ కావటం ఈ మధ్యన ఒక దురలవాటుగా మారింది. మాధవీలత ఇప్పుడు అలాంటి ట్రాక్ లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి ధోరణి ఆమె ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వదిలించుకోవటం మంచిది.




Tags:    

Similar News