పెట్రోల్ ధర గురించి మాట్లాడతావా? అఫ్గాన్ కు పోవయ్యా.. బీజేపీ నేత పైత్యం

Update: 2021-08-20 15:30 GMT
2004లో వాజ్ పేయ్ ప్రభుత్వం మీద పెద్దగా వ్యతిరేకత లేకున్నా.. ఎన్నికల్లో ఓటమి చెందటానికి కారణం గుర్తుందా? అవును.. ఆయన హయాంలో ఉల్లికి మహా డిమాండ్ వచ్చేసి.. ఆ రోజుల్లోనే కిలో వంద రూపాయిలు పలికింది. పెరిగిన ఉల్లి ధరను తగ్గించే విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించకపోవటం.. దాని కారణంగా ఏకంగా అధికారాన్ని చేజార్చుకోవాల్సి వచ్చింది. భారత్ వెలిగిపోతోందంటూ.. వాజ్ పేయ్ మీద ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తమకు అధికారం మరోసారి చేతికి వస్తుందని అంచనా వేసుకున్నారు. కానీ.. ఆయన పాలనలో కేజీ ఉల్లి ధర సెంచరీ దాటిన వైనం తమను దెబ్బేస్తుందన్న విషయాన్ని గుర్తించలేకపోయారు.

తాజాగా ఇప్పుడు అలాంటి పరిస్థితే మోడీ సర్కారుకు ఎదురవుతోంది. లీటరు పెట్రోల్ సెంచరీ దాటి చాలా కాలమే అయితే.. లీటరు పెట్రోల్ సెంచరీకి దగ్గరకు వచ్చేసిన పరిస్థితి. దీంతో.. ఈ ధరల దెబ్బకు సామాన్యుడు మొదలు సంపన్నులు సైతం కిందామీదా పడుతున్న పరిస్థితి. మోడీ ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసిన రెండు అంశాల్లో ఒకటి కరోనా అయితే.. రెండోది పెట్రో ధరలుగా చెబుతారు. అలా అని పెట్రోల్.. డీజిల్ ధరల్ని తగ్గిస్తే.. దాని ఆదాయం మీద ఆధారపడి బతుకుతున్న కేంద్రానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. అందుకే.. పెరిగిన ధర గురించి ప్రస్తావించకుండా కిందామీదా పడుతున్నారు కమలనాథులు.

అయినప్పటికీ మీడియా రూపంలోనూ.. సామాన్యుల రూపంలో వారికి ఈ చిక్కు ప్రశ్న ఎదురవుతోంది. వారి నోటి నుంచి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల ప్రస్తావన వచ్చినంతనే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. తాజాగా అలాంటి అనుభవం ఒక జర్నలిస్టుకు ఎదురైంది. మధ్యప్రదేశ్ కు చెందిన ఒక బీజేపీ నేతను మీడియా ప్రతినిధి పెట్రోల్ ధరల మంట మీద ప్రశ్నించారు. అంతే.. ఆయనకు ఎక్కడో కాలిపోయింది. బ్యాలెన్స్ తప్పిన ఆయన.. అనకూడని మాట అనేశారు.

పెట్రోల్ చవకగా కావాలంటే పోయి అఫ్గాన్ లో పోయించుకో.. ఇప్పుడు అక్కడ పోయించుకోవటానికి ఎవరు లేరంటూ మండిపడ్డారు. అఫ్గాన్ లో రూ.50కే దొరుకుతుందని.. వెళ్లి అక్కడే పోయించుకురా అంటూ మండిపడిన వైనం షాకింగ్ గా మారింది. అక్కడ పెట్రోల్ ఎవరూ పోయించుకోవటం లేదు.. ఇక్కడైతే కనీసం పెట్రోల్ పోయించుకునే స్వేచ్ఛ అయినా ఉందన్నారు. కరోనా రెండు దశల కారణంగా ఇప్పటికే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న ఆయన.. ''మూడో దశ వస్తుందని చెబుతున్నారు. ఇలాంటి కష్ట సమయంలో పెట్రోల్ గురించి మాట్లాడతావేంటి?''అంటూ ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బీజేపీ నేతల గురించి ఏమైనా అడగండి.. పెట్రోల్ ధరల గురించి మాత్రం అడగొద్దు.. వారికి ఎక్కడో మండుతుందన్న సటైర్లు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. అర్థమైందిగా.. బీజేపీ నేతల్ని ఏమైనా అడగొచ్చు.. పెరిగిన పెట్రోల్ ధరల గురించి తప్ప. 
Tags:    

Similar News