అమ్మ స‌మాధిని తీసేయ‌మంటున్నారు

Update: 2017-07-25 06:10 GMT
త‌మిళుల ఆరాధ్య‌దైవంగా చెప్పుకునే దివంగ‌త అమ్మ జ‌య‌ల‌లిత‌పై ఒక విచిత్ర‌మైన వ్యాజ్యం ఒక‌టి మ‌ద్రాసు హైకోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత మెరీనా బీచ్ ఒడ్డున ఏర్పాటు చేసిన అమ్మ స‌మాధిని అక్క‌డ నుంచి తొల‌గించాల‌ని కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించారు న్యాయ‌వాది ఎస్ దురైస్వామి. ద్ర‌విడ ఉద్య‌మ ర‌థ సార‌థి అన్నాదురై.. త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల ఆరాధ్య దైవంగా కొలిచే ఎంజీ రామ‌చంద్ర‌న్‌..అంద‌రికీ ఆద‌ర్శ‌నీయుడైన కామ‌రాజ నాడార్ లాంటి మ‌హాపురుషుల స‌మాధుల స‌ర‌స‌న నేర‌స్తురాలైన జ‌య‌ల‌లితకు స్థానం కల్పించ‌టం ఏమిట‌న్న ధ‌ర్మ‌సందేహాన్ని ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం రూపంలో సంధించారు.

ఈ నేప‌థ్యంలో అమ్మ స‌మాధిని ఇప్పుడు ఏర్పాటు చేసిన మెరీనా బీచ్ నుంచి త‌ర‌లించాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పిల్ మ‌ద్రాసు హైకోర్టు విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా పిటీష‌న్ వేసిన న్యాయ‌వాది దురైస్వామి పిటీష‌న్ లో త‌న వాద‌న‌ల్ని వినిపిస్తూ.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జ‌య‌ల‌లిత‌కు బెంగ‌ళూరు ప్ర‌త్యేక కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష.. రూ.100 కోట్ల జ‌రిమానాను విధించిన విషయాన్ని గుర్తు చేశారు.

కోర్టు తీర్పు వెలువ‌డిన త‌ర్వాత జ‌య కొన్నాళ్లు జైలు జీవితాన్ని గ‌డిపి బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని.. ప్ర‌త్యేక కోర్టు తీర్పుపై బెంగ‌ళూరు హైకోర్టులో అప్పీలు చేసి నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డ్డార‌న్నారు.

అయితే.. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం.. డీఎంకే దాఖ‌లు చేసిన అప్పీల్ పిటీష‌న్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. కింది కోర్టు వేసిన శిక్ష‌ను ఖ‌రారు చేసింది. అయితే.. ఈ కేసులో నిందితురాలైన జ‌య అప్ప‌టికే మ‌ర‌ణించిన నేప‌థ్యంలో ఆమెకు శిక్ష‌ను ఖ‌రారు చేయ‌లేదు. ఈ కేసులో జ‌య‌తో పాటు ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న శ‌శిక‌ళ‌.. సుధాక‌ర‌న్.. ఇళ‌వ‌ర‌సిలు ప్ర‌స్తుతం జైలుశిక్ష‌ను అనుభ‌విస్తున్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

మెరీనా తీరంలో వీవీఐపీల‌కు మాత్ర‌మే స్మార‌క మండ‌పం క‌ట్టాల‌నే సంప్ర‌దాయం ఉన్న నేప‌థ్యంలో.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా నిరూపిత‌మైన జ‌య‌ల‌లిత స్మార‌కాన్ని ఎలా నిర్మిస్తార‌ని ప్ర‌శ్నించారు. ఆస్తుల కేసులో శిక్ష ప‌డిన జ‌య‌ల‌లిత స్మార‌క మండ‌పం క‌ట్ట‌టం వ‌ల్ల ఆమె చేసిన నేరానికి గుర్తుగా మిగిలే ప్ర‌మాదం ఉంద‌న్న ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేశారు.

ప‌ర్యావ‌ర‌ణం.. స‌ముద్ర‌తీర ప్రాంతాల్లో స్మార‌క నిర్మాణాల్ని నిర్మించ‌టం నిబంధ‌న‌ల‌కు విరుద్ధమ‌న్న వాద‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు. బీచ్ తీరం నుంచి 500 అడుగుల్లో ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్ట‌కూడ‌ద‌ని ప‌ర్యావ‌ర‌ణ శాఖ నిబంధ‌న‌లు చెబుతున్నాయ‌న్నారు. రూల్స్‌కు భిన్నంగా చేప‌డుతున్న జ‌య స్మాక‌ర మండ‌పం ప‌నుల‌పై నిషేధాన్ని విధించాల‌ని.. జ‌య మృత‌దేహాన్ని అక్క‌డ నుంచి తొల‌గించాలంటూ పిటీష‌న్లో పేర్కొన్నారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. పిటీష‌న‌ర్ లేవ‌నెత్తిన అభ్యంత‌రాల‌కు స‌మాధానాలు ఇవ్వాల్సిందిగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి.. చెన్నై కార్పొరేష‌న్ సీఎండీఏకు.. ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌కు నోటీసులు పంపాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Tags:    

Similar News