టీడీపీకి 'ప్ర‌కాశం' షాక్‌!... మామూలుగా లేదే!

Update: 2019-03-14 12:40 GMT
ఓ వైపు సార్వ‌త్రిక ఎన్నిక‌లు - మ‌రోవైపు కీల‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌లు... ఈ రెండింటి నేప‌థ్యంలో ఏపీలో అధికార పార్టీ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎంపీల‌తో పాటు ప‌లువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి నేరుగా విప‌క్ష వైసీపీ గూటికి చేరిన నేప‌థ్యంలో... అస‌లు వ‌ల‌స‌ల‌ను ఎలా నిరోధించాలో తెలియక నానా తంటాలు ప‌డుతున్న టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... పార్టీని వీడ‌తార‌ని ప్ర‌చారం సాగుతున్న నేత‌లతో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తున్నారు. ఫోన్ల‌లో మంత‌నాలు - అమ‌రావ‌తికి పిలిపించుకుని మాట్లాడుతూ... అస‌లు మీకేం కావాలో చెప్పండంటూ ఆరాలు తీస్తున్నారు. మేం ప్ర‌తిపాదించిన సీటు కాకుంటే... ఇంకే సీటు కావాలో చెప్పాలంటూ ఏకంగా కాళ్ల బేరానికే దిగుతున్నారు. అయితే ఈ చంద్ర‌బాబు నైజం ఏమిటో తెలిసిన నేత‌లు మాత్రం ఆయ‌న మంత‌నాల‌కు ఏమాత్రం క‌రిగిపోవ‌డం లేదు. ఈ త‌ర‌హాలోనే ఇప్పుడు సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌గానే కాకుండా ఇటు ప్ర‌కాశం జిల్లాతో పాటు అటు నెల్లూరు జిల్లాలోనూ పెను ప్ర‌భావం చూప‌గ‌లిగే స‌త్తా ఉన్న పార్టీ ఎమ్మెల్సీ - ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పేశారు.

ఈ మేర‌కు కాసేపటి క్రితం మీడియా ముందుకు వ‌చ్చిన ఆయ‌న టీడీపీకి రాజీనామా చేస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాకుండా ఇంత‌కుముందు షాకిచ్చిన నేత‌ల మాదిరే త్వ‌ర‌లోనే తాను వైసీపీలో చేరుతున్న‌ట్లుగా కూడా ప్ర‌క‌టించేశారు. త‌న రాజీనామాను పార్టీ అదినేత చంద్ర‌బాబుకు పంపిన‌ట్లు కూడా ఆయ‌న పేర్కొన్నారు. అంతేకాకుండా పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లుగా చంద్ర‌బాబుకు పంపిన లేఖ‌ను కూడా ఆయ‌న మీడియాకు విడుదల చేశారు. గ‌త కొన్ని రోజులుగా టీడీపీ అధిష్ఠానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాగుంట వైసీపీలో చేరిపోవ‌డం ఖాయ‌మేన‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ వార్త‌లు నిజ‌మేన‌న్న‌ట్లుగా ఇప్పుడు మాగుంట సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మాగుంట టీడీపీని వీడి వైసీపీలో చేరితే... ఇటు ప్ర‌కాశం జిల్లాతో పాటు అటు నెల్లూరు జిల్లా స‌మీక‌ర‌ణాలు కూడా పూర్తిగా మారిపోయే అవ‌కాశాలున్నాయి. ఇప్ప‌టికే ఈ రెండు జిల్లాల‌పై గ‌ట్టి ప‌ట్టును సాధించిన వైసీపీకి... ఇప్పుడు మాగుంట చేరిక‌తో మ‌రింత‌గా క‌లిసి వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.
Tags:    

Similar News