మరాఠీలా మజాకా... స్టాంపుతో కరోనాకు కట్టడి

Update: 2020-03-17 11:00 GMT
కరోనా ప్రభావం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉంది. అక్కడే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ ఇంకా వ్యాపించకుండా మరాఠా సర్కారు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కరోనా అనుమానితుల చేతులపై స్టాంపు ముద్రలు వేస్తోంది. తమ ఇళ్లలోనే ప్రత్యేక గదుల్లో ఉండిపోతున్నవారి చేతులపై చెరిగిపోని ఇంకు తో స్టాంపులు వేస్తోంది. ‘‘ముంబయి వాసులను రక్షిస్తున్నందుకు గర్వపడుతున్నా. హోమ్‌ క్వారంటైన్డ్‌’’ అన్న వ్యాఖ్య ఆ స్టాంపు ముద్రలో కనిపిస్తోంది. దీంతోపాటు వారు ఏ తేదీ వరకు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలో కూడా ఆ ముద్రలోనే తెలుస్తుంది. స్టాంపు ముద్రల ద్వారా కరోనా అనుమానితులను గుర్తించడం సులభమని, వారు మిగిలిన ప్రజల తో కలవకుండా ఆపొచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

మహారాష్ట్రలో ఇప్పటివరకు 39 కరోనా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల వల్ల వైరస్‌ సోకే రెండో దశలో ఈ రాష్ట్రం ఉంది. సొంతగడ్డపైనే ఒకరి నుంచి మరొకరికి వ్యాధి వ్యాపించడం కరోనాలో మూడో స్టేజ్‌. ఆ మూడో అడుగు వేయకుండా మరాఠా సర్కారు తంటాలు పడుతోంది. కరోనాపై పోరులో రానున్న 20 రోజులు అత్యంత ముఖ్యమైనవి. ఎందుకంటే, తొలి రెండు స్టేజిల్లో అతి తక్కువగా కనిపించే వైరస్‌... మూడో స్టేజిలోకి చేరిందంటే పట్టపగ్గాల్లేకుండా విహరిస్తుంది. చైనా, ఇటలీలోనూ ఇలాగే జరిగి, లక్షల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వేల మంది చనిపోయారు.
Tags:    

Similar News