మ‌హిషాసురుడి స్థానంలో మ‌హాత్ముడు.. దేశంలో విద్వేష‌పు మంట‌లు!!

Update: 2022-10-03 08:30 GMT
ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రులు దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈఉత్స‌వాల్లో ఎప్పుడూ ముందుండే.. ప‌శ్చిమ బెంగాల్‌లో అమ్మ‌వారి మండ‌పాల‌ను ఏర్పాటు చేశారు. అయితే.. అఖిల భారతీయ హిందూ మహాసభ కోల్కతాలో ఏర్పాటు చేసిన దుర్గా మండపం తీవ్ర వివాదాస్పదమైంది. అంతేకాదు.. విద్వేషాల‌కు సైతం దారితీసింది. దుర్గమ్మ పాదాల కింద ఉండే మ‌హిషాసురుడి(రాక్షసుడి) రూపం మహాత్మా గాంధీని తలపించడం దుమారం రేపింది.

మ‌హిషాసురుడి స్తానంలో మ‌హాత్ముడి బొమ్మ‌ను ఏర్పాటు చేయ‌డంపై ప్ర‌భుత్వం.. ప్ర‌జాస్వామ్య సంఘాలు.. గాంధీ వాదులు సైతం తీవ్ర స్థాయిలో త‌ప్పుబడుతున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అఖిల భారతీయ హిందూ మహాసభ ఈ మండపాన్ని ఏర్పాటు చేసింది. దుర్గా మాత వధించిన అసురుడి ముఖం.. గుండ్రటి కళ్లద్దాలతో బాపూను తలపించింది.

ఈ విషయంపై  అఖిల భారతీయ హిందూ మహాసభ ఏమాత్రం విచారం లేకుండా స్పందించింది. "గాంధీ.. జాతిపిత అని మేము విశ్వసించడం లేదు. దుర్గమ్మ విగ్రహంలో అసురుడి రూపం గాంధీని తలపించడం యాదృచ్ఛికం మాత్రమే. అవసరమైన అనుమతులు అన్నీ తీసుకున్నా.. మా పూజా మండపం మూసేయాలని అధికార యంత్రాంగం ఒత్తిడి చేస్తోంది." అని హిందూ మహాసభ బంగాల్ అధ్యక్షుడు మొహంతో సుందర్ గిరి మహారాజ్  చెప్పారు.

ఈ వ్యవహారం వివాదాస్పదమైన నేపథ్యంలో నిర్వాహకులు విగ్రహాన్ని మార్చారు. పోలీసుల ఒత్తిడి మేరకే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే.. పూజా మండపం మూసేయాలని అధికారులు ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణల్ని కోల్కతాకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తోసిపుచ్చారు. తాము ఎవరికీ అలాంటి సూచనలు చేయలేదని స్పష్టం చేశారు.

అధికార తృణమూల్ కాంగ్రెస్ విగ్రహం వివాదంపై తీవ్ర విమర్శలు చేసింది. "ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. అసలు మాటలు కూడా రావడం లేదు. ఇంతకన్నా అవమానకరం ఇంకేమైనా ఉంటుందా? నవరాత్రి ఉత్సవ స్ఫూర్తినే ఇది దెబ్బతీసింది. ఈ మొత్తం వ్యవహారం అధికారుల దృష్టికి వచ్చింది. వారు తగిన చర్యలు తీసుకుంటున్నారు" అని  తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ చెప్పారు.

హిందూ మహాసభ కొంతకాలం క్రితం నిషేధానికి గురైంది. గాంధీ జయంతి అయిన అక్టోబరు 2ను ఆ సంస్థ బ్లాక్ డేగా పాటిస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News