జ‌గ‌న్‌ పై అటాక్‌!...ఖాకీలది కొత్త వాద‌నేనా?

Update: 2019-01-02 11:23 GMT
ఏపీ విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఇటీవ‌ల విశాఖ ఎయిర్ పోర్టులో జ‌రిగిన హ‌త్యాయత్నం రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు యావ‌త్తు దేశ‌వ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ప‌టిష్ఠ భ‌ద్ర‌త ఉండే ఎయిర్ పోర్టులో ఓ కీల‌క రాజ‌కీయ నేత‌పై దాడి జ‌రిగిందంటే... దాని వెనుక కీల‌క వ్య‌క్తులే కాకుండా ఉన్న‌త స్థానాల్లో ఉన్న వారి ప‌థ‌కం ప్రకార‌మే దాడి జ‌రిగి ఉంటుంద‌న్న వాద‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అయితే జ‌గ‌న్‌ పై దాడి జ‌రిగిన మ‌ర‌క్ష‌ణ‌మే మీడియా ముందుకు వ‌చ్చిన రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్‌... విప‌క్ష నేత‌పై దాడి జ‌రిగిన దాడిని చాలా చిన్న‌దిగా చూపించే య‌త్నం చేశారు. అంతేకాకుండా... జ‌గ‌న్‌ పై దాడి చేసిన యువ‌కుడు వైసీపీ సానుభూతిప‌రుడంటూ కూడా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నిందితుడు వైసీపీ వ్యక్తేన‌ని న‌మ్మించేందుకు పోలీసులు చేసిన హ‌డావిడి కూడా ఈ సంద‌ర్భంగా వివాదాస్ప‌దంగా మారింది. నిందితుడి ఇంటిలో స్వాధీనం చేసుకున్న‌ట్లుగా ఓ ఫ్లెక్సీని చూపిన పోలీసులు... అందులో జ‌గ‌న్ ఫొటో ప‌క్క‌నే నిందితుడి ఫొటోను కూడా చూపించేసి... ప్ర‌జ‌ల్లో సానుభూతి కోస‌మే జ‌గ‌న్ త‌న‌పై దాడి చేయించుకున్నార‌న్న కోణంలో వెంట‌వెంట‌నే ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేశారు. మీడియా స‌మావేశాల్లోనూ ఇదే మాట‌ను ప‌దే ప‌దే చెప్పారు.

ఇక ఎప్పుడెప్పుడు రంగంలోకి దిగుదామా? అని ఎదురుచూసిన టీడీపీ నేత‌లు వెనువెంట‌నే రంగంలోకి దిగిపోయారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయి క‌దా... ప్ర‌జ‌ల్లో సానుభూతి కోస‌మే జ‌గ‌న్ ఈ దాడి చేయించుకున్నార‌ని చెవులు చిల్లులు ప‌డేలా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేశారు. విప‌క్ష నేత హోదాలోని నేత‌పైనే జ‌రిగిన దాడిని ఏమాత్రం ఖండించ‌ని టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కూడా... సొంత పార్టీ కార్య‌క‌ర్త జ‌గ‌న్‌ పై దాడి చేస్తే తామేం చేసేదంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మొత్తంగా ఇటు సీఎం - అధికార పార్టీ నేత‌లు - మంత్రులు - చివ‌ర‌కు పోలీసులు కూడా త‌న‌పై జ‌రిగిన దాడిని చాలా చిన్న‌దిగా చేసి చూడ‌టంతో ఆగ్ర‌హం వ్యక్తం చేసిన జ‌గ‌న్‌... చికిత్స తీసుకున్న త‌ర్వాత కేంద్రానికి లేఖ రాశారు. విప‌క్ష నేత హోదాలో ఉన్న త‌న‌పైనే దాడి జ‌రిగితే క‌నీస ధ‌ర్మాన్ని మ‌రిచిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం... ఘ‌ట‌న తీవ్ర‌త‌ను త‌క్కువ‌గా చేసి చూపిస్తోందని, ఈ కార‌ణంగా ఈ కేసును కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో ద‌ర్యాప్తు చేయించాల‌ని కూడా ఆయ‌న త‌న లేఖ‌లో కోరారు. అంతేకాకుండా ఇదే విష‌యంపై హైకోర్టులోనూ పిటిష‌న్ దాఖ‌లు చేసిన జ‌గ‌న్‌... కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల ద‌ర్యాప్తు జ‌రిగితే... వాస్త‌వాలు తెలుస్తాయ‌ని - వాస్త‌వాల‌ను క‌ప్పిపుచ్చే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం - రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి తాను స‌హ‌క‌రించ‌లేద‌ని కూడా న్యాయ‌స్థానానికి తెలిపారు.

ప్ర‌స్తుతం ఈ కేసు హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న త‌రుణంలో కాసేప‌టి క్రితం విశాఖ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ మ‌హేశ్ చంద్ర ల‌డ్హా మీడియా ముందుకు వ‌చ్చారు. గ‌తంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ - ఈ కేసు ద‌ర్యాప్తున‌కు ప్ర‌త్యేకంగా నియమించిన సిట్ అధికారులు చేసిన వ్యాఖ్య‌ల‌కు భిన్న‌మైన వాద‌న వినిపించిన ల‌డ్హా... ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌పై దాడికి నిందితుడు శ్రీ‌నివాస‌రావు... ప‌థ‌కం ప్ర‌కార‌మే వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపాడ‌ని - జ‌గ‌న్‌ పై దాడి చేసేందుకు నిర్ణ‌యించుకున్న అత‌డు... దాడికి వినియోగించాల‌నుకున్న రెండు క‌త్తుల‌ను కూడా ముందుగానే ఎయిర్ పోర్టులోకి తీసుకొచ్చాడ‌ని తెలిపారు. అంతేకాకుండా... ఈ దాడిని నిందితుడు పూర్తి స్థాయిలో అవ‌గాహ‌న ఉండే చేశాడ‌ని - దాడి త‌ర్వాత త‌న‌కు ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యంపైనా అత‌డికి అవ‌గాహ‌న ఉందని చెప్పారు. అంతేకాకుండా అక్టోబ‌ర్ 18న‌నే జ‌గ‌న్ పై దాడి చేయాల‌ని నిర్ణ‌యించుకున్న నిందితుడు... 17న‌నే జ‌గ‌న్ హైద‌రాబాదు వెళ్లిపోవ‌డంతో దాడిని 25కు వాయిదా వేసుకున్నాడ‌ని వివ‌రించారు. ఇక దాడికి ముందు క‌త్తుల‌ను వేడి నీటిలో క‌డిగాడ‌ని - ఈ దాడి విష‌యాన్ని త‌న‌కు స‌న్నిహితంగా ఉన్న ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు అత‌డు చెప్పాడ‌ని కూడా ల‌డ్హా వివ‌రించారు.

దాడి సంద‌ర్భంగా త‌న జేబులో దొరికిన లేఖ‌ను విజ‌య‌ల‌క్ష్మి అనే మ‌హిళ‌తో ముందుగానే రాయించి పెట్టున్నాడ‌ని తెలిపారు. ఇక అత‌డి ఇంటిలో ల‌భ్య‌మైన ఫ్లెక్సీని కూడా జ‌గ‌న్‌ పై దాడి చేసేందుకు నిర్ణ‌యించుకున్న త‌ర్వాతే త‌యారు చేయించిపెట్టుకున్నాడ‌ని కూడా కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. మొత్తంగా జ‌గ‌న్‌ పై జ‌రిగిన దాడి ఎంత‌మాత్రం చిన్న‌ది కాద‌ని - ప‌క్కా ప్రణాళిక‌తోనే జ‌రిగిన దాడిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. మొత్తంగా జ‌గ‌న్ పై దాడి జ‌రిగిన దాడిని చాలా చిన్న‌దిగా అభివ‌ర్ణించేసిన డీజీపీ ఆర్పీ ఠాకూర్ వాద‌న‌కు పూర్తి భిన్నంగా ల‌డ్హా వివ‌రాల‌ను వెల్ల‌డించార‌ని చెప్పాలి. అంటే జ‌గ‌న్‌ పై జ‌రిగిన దాడి చిన్న‌దంటూ విష ప్ర‌చారం చేసిన టీడీపీ నేత‌లు - టీడీపీ అనుకూల మీడియా వాద‌న కూడా త‌ప్పేన‌ని ల‌డ్హా వివ‌రించిన‌ట్లైంది. ఉమ్మ‌డి హైకోర్టు విభ‌జ‌న త‌ర్వాత ఏపీ హైకోర్టు విజ‌య‌వాడ‌లో కొలువైన మ‌రునాడే ల‌డ్హా ఈ కేసులోని వాస్త‌వాల‌ను వెల్ల‌డించేందుకు సిద్ధ‌ప‌డ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారిందని చెప్పాలి.


Full View

  

Tags:    

Similar News