ఉత్త‌మ్‌ లో క‌ల‌క‌లం..న‌మ్మిన‌బంటు గుడ్‌ బై

Update: 2018-08-26 06:20 GMT
    ఓవైపు అధికార‌ టీఆర్‌ ఎస్ పార్టీ నేతలు దూకుడు మీద ఉండి ప్రగతి నివేదన బహిరంగసభకు సిద్ధమవుతుంటే...అదే స్థాయిలో స‌న్న‌ద్ధం కావాల్సిన ప్ర‌ధానప్ర‌తిప‌క్ష‌మై కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో అబాసుపాలు అవుతోంది. అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యానికి వేదిక అయిన ఆ పార్టీలో తాజాగా ఏకంగా అధ్య‌క్షుడిపై తిరుగుబాటు జెండా ఎగుర‌వేశారు. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న కాంగ్రెస్ బస్సు యాత్ర కన్వీనర్ త‌న ప‌ద‌వికి గుబ్ బై చెప్పేశారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు - బ‌స్సుయాత్ర క‌న్వీన‌ర్‌ మహేశ్వర్‌ రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. తన నియోజకవర్గంలో పనిచేసుకోవడానికి పదవి అడ్డొస్తున్నందున కన్వీనర్ పదవి నుంచి తప్పుకొంటున్నట్టు మహేశ్వర్‌ రెడ్డి మీడియాకు తెలిపిన‌ప్ప‌టికీ...పార్టీ చీఫ్ ఉత్త‌మ్ తీరుపై గుస్సాతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీరు నచ్చకనే కన్వీనర్ పదవికి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయం తీసుకొన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఉత్తమ్ తీరుపై గత కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్న మహేశ్వర్‌ రెడ్డి.. నియోజకవర్గంలో పార్టీ పనులు చక్కబెట్టుకోవాలనే సాకు చూపినట్టుగా సమాచారం. బస్సుయాత్ర సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ఎన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి త‌న‌తో ఖర్చు బాగా పెట్టినట్టు తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత కల్పించడంలో తనను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఉత్తమ్‌ పై ఆయన రుసగుసలాడినట్టు తెలిసింది. ఏఐసీసీ జాతీయ కార్యదర్శి పదవి ఇప్పిస్తానని రాష్ట్ర నాయకత్వం హామీ ఇచ్చి తనను మోసం చేసిందన్న ఆవేదనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ పదవులను దక్షిణ తెలంగాణలోని రెండు జిల్లాలకే కట్టబెడుతున్నారనే అపవాదును టీపీసీసీ మూటగట్టుకొంది.

ఇదిలా ఉండగా మహేశ్వరరెడ్డి రాజీనామాపై ఉత్తమ్‌ ను ప్రశ్నించగా అదేమీ లేదంటూ సమాధానం దాటవేశారు. ఇలాటివన్ని కాంగ్రెస్‌ పార్టీలో మాములేనని - అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉత్తమ్‌ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని - ఆయన నాయకత్వం పట్ల తనకు ఎలాంట అసంతృప్తి లేదన్నారు. ఉత్తర తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం సీరియస్‌ గా పని చేస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా, బస్సు యాత్ర కో-కన్వీనర్‌ గా ఉన్న పొంగులేటి సుధాకర్‌ రెడ్డి కూడా ఆ పదవికి గుడ్‌ బై చెప్పే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే తన ఆవేదనను లేఖ రూపంలో పార్టీ హైకమాండ్‌ కు అందించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.ఈ ప‌రిణామం కాంగ్రెస్‌లో క‌ల‌క‌లానికి దారితీస్తోంది.
    
    
    

Tags:    

Similar News