టీ డిప్యూటీ సీఎం ఇంటిపై మజ్లిస్ రౌడీయిజం

Update: 2016-02-03 05:13 GMT
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన మజ్లిస్ పార్టీ అధినేత మొదలు కార్యకర్తల వరకూ అధికారపార్టీతో సహా విపక్షాల్ని వదిలిపెట్టలేదు. అధికారపార్టీకి చెందిన డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గరే మజ్లిస్ ఎమ్మెల్యే దౌర్జన్యం చేయటం విశేషం. డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంట్లో విధులు నిర్వహిస్తున్న 20 మందికి పైగా భద్రతా సిబ్బంది మజ్లిస్ మూకకు భయపడి పారిపోయారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధి ఉత్తమ్.. మండలి కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ మీద జరిగిన దాడి గురించి మీడియాలో వచ్చినా.. డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర జరిగిన రచ్చ గురించి పెద్ద సమాచారం రాలేదు. ఇక.. అక్కడేం జరిగిందన్న విషయాన్ని చూస్తే..

మజ్లిస్ కు కంచుకోటగా చెప్పుకునే ఆజంపురా.. దబీర్ పురా.. ఓల్డ్ మలక్ పేట్.. అక్బర్ బాగ్ డివిజన్ల మీద తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ దృష్టి సారించారు. ఈసారి అక్కడ గులాబీ జెండా ఎగరాలన్న పట్టుదలతో నెల రోజులుగా వర్క్ చేస్తున్నారు. వారు ఆశించినట్లే కాస్త సానుకూలత చోటు చేసుకోవటం మజ్లిస్ నేతలకు మింగుడుపడని వ్యవహారంగా మారింది. ఈ డివిజన్ల వ్యవహారాలు చూస్తున్న మలక్ పేట ఎమ్మెల్యే అమ్మద్ బలాలకు జరుగుతున్న సంఘటనలు మింగుడుపడని విధంగా మారాయి. దీంతో.. మజ్లిస్ నేతల్లో మరోకోణం బయటకు వచ్చంది.

ఎన్నికల సమయంలో రిగ్గింగ్ కు పాల్పడే మజ్లిస్ నేతలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు అందిస్తూ.. తాము దృష్టి సారించిన డివిజన్లలో పోలింగ్ సక్రమంగా చూసే ప్రయత్నం చేశారు. దీంతో.. మజ్లిస్ నేతల ఆగ్రహానికి కారణమైంది. ఇదే సమయంలో బలాల.. డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. బలాల నేతృత్వంలో వందలాది మంది మజ్లిస్ కార్యకర్తలు ఉప ముఖ్యమంత్రి ఇంటి ముందు నిలబడి తిట్ల దండకం అందుకున్నారు. ఇలా సాగిన ఆందోళన ఒకదశలో హద్దులు దాటింది. ఇంటి గేటు ముందు నిల్చున్న డిప్యూటీ సీఎం కుమారుడ్ని తిడుతూ.. అతనిమీద దాడికి పాల్పడ్డారు. డిప్యూటీ సీఎం కుమారుడు ఆజం ఆలీని తోసేస్తూ.. అక్కడి టీఆర్ఎస్ కార్యాలయంలోకి లాక్కెళ్లారు. మొదటి అంతస్తులో ఉన్న డిప్యూటీ సీఎం వడివడిగా కిందకు రావటం.. ఇదేంటని ప్రశ్నిస్తున్న ఆయన్ను తోసేశారు.

తన ఓపికను పరీక్షిస్తావ్ అంటూ ఏకవచనంలో సంబోధిస్తూ.. డిప్యూటీ సీఎం కొడుకు మీద దాడి చేస్తున్నా భద్రతా సిబ్బంది నిలువరించని దుస్థితి. తమ ఇంటి దగ్గర జరిగిన దాడి.. తన కొడుకుపైనా చేయి చేసుకోవటం లాంటి వివరాలు తెలుసుకున్న డిప్యూటీ సీఎం సతీమణి టెన్షన్ తో సొమ్మసిల్లి పడిపోయారు. తన భర్త (ఢిప్యూటీ సీఎం)కు.. కుమారుడికి ఏం జరగలేదని సీఎం కుటుంబీకులు చెప్పినా.. ఆమె విలపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉందన్న సమాచారం అందుకున్న సీఎం కేసీఆర్.. తన కుమారుడు.. మంత్రి కేటీఆర్ కు సమాచారం ఇచ్చి ఉప ముఖ్యమంత్రి ఇంటికి పంపినట్లుగా చెబుతున్నారు. మరోవైపు.. పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హుటాహుటిన చేరుకొని ఎంతటి మొనగాడినైనా చర్యలు తప్పవని ప్రకటించారు. అయినప్పటికీ.. మజ్లిస్ నేతల్ని ఎవరిని అదుపులోకి తీసుకోకపోవటం గమనార్హం.
Tags:    

Similar News