ట్రంప్‌.. పుతిన్.. జిన్ పింగ్ బాట‌లో మోడీ!

Update: 2019-06-30 04:41 GMT
ప్ర‌ముఖ పాత్రికేయుడు.. ఎడిట‌ర్ గిల్ట్ అధ్య‌క్షుడు శేఖ‌ర్ గుప్తా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల కాలంలో మీడియా మీద ఒత్తిళ్లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్న వేళ‌.. అలాంటి వాటి నుంచి ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని పొందాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా చేసిన పోలిక ఆస‌క్తిక‌రంగా మారింది. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్.. ర‌ష్యా అధినేత పుతిన్.. చైనా అధినేత జిన్ పింగ్ ల‌తో ప్ర‌ధాని మోడీని ఆయ‌న పోల్చ‌టం గ‌మ‌నార్హం.

ఈ మూడు దేశాల అధినేత‌లు త‌మ దేశాల్లో తిరుగులేని నేత‌లుగా చెప్పాలి. అంతేకాదు.. ఈ ముగ్గురు వివాదాస్ప‌ద వైఖ‌రి కామ‌న్ పాయింట్. అంతేకాదు.. ఈ ముగ్గురిలో మ‌రో కామ‌న్ అంశం.. మీడియాపై దునుమాడ‌టం. అమెరికా మీడియాకు ట్రంప్ కు మ‌ధ్య‌నున్న పంచాయితీని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. చైనాలో జిన్ పింగ్ చెప్పిందే వేదం. ర‌ష్యాలోనూ పుతిన్ తీరుపై ఉన్న ఆరోప‌ణ‌లు అన్ని ఇన్ని కావు. ర‌ష్యాకు పుతిన్ అధ్య‌క్షుడు అయిన నాటి నుంచి అక్క‌డి మీడియా ఎంత‌లా మారిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

ఇలాంటి వారికి న‌క‌లుగా మోడీని ఆయ‌న త‌న వ్యాఖ్య‌ల్లో ప్ర‌స్తావించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. దేశ ప్ర‌ధాని మాత్ర‌మే కాదు.. దేశంలోని ముఖ్య‌మంత్రులు బ‌ల‌మైన శ‌క్తిగా ఉండ‌టంతో మీడియాతో స‌హా అన్ని అంశాల్ని త‌మ గుప్పిట్లో ఉంచుకున్నార‌న్న విష‌యాన్ని ఆయ‌న వెల్ల‌డించారు. చాలా రాష్ట్రాల్లో మంత్రివ‌ర్గం అన్న‌ది  నామ‌మాత్రంగా మారింద‌ని.. ఒక‌రిద్ద‌రు అధికారులు.. స‌ల‌హాదారులు మాత్ర‌మే కీల‌కం అవుతున్నార‌న్నారు.

ముఖ్య‌మంత్రులు త‌మ వార‌స‌త్వాల్ని కాపాడుకునేందుకు మీడియాపైనా ఒత్తిడి పెడుతున్నార‌న్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాదు ప్ర‌పంచ స్థాయిలోనూ మీడియా మీద ఏదో ర‌కంగా దాడి జ‌రుగుతూనే ఉంద‌న్న శేఖ‌ర్ గుప్తా.. ప్ర‌పంచంలో కీల‌క దేశాల అధినేత‌లైన ట్రంప్.. పుతిన్.. జిన్ పింగ్ వ‌రుస‌లో మోడీని కూడా చేర్చ‌టం ఆస‌క్తిక‌రం. అధికారంలో ఉన్న వారి ఒత్తిడి కార‌ణంగా మీడియా సొంత ప్ర‌తిష్ట‌ను కోల్పోతుంద‌న్న మాట‌ను ఆయ‌న నోటి నుంచి రావ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌పంచ దేశాధినేత‌ల్లో ఉండే కామ‌న్ పాయింట్ మ‌న దేశ ప్ర‌ధానిలో ఉన్న విష‌యాన్ని ఒక ప్ర‌ముఖ పాత్రికేయుడు ప్ర‌స్తావించ‌టం ద్వారా.. దేశంలో మీడియా ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న విష‌యాన్ని ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

Tags:    

Similar News