తెలుగు తమ్ముళ్ల మాదిరి బూట్లు వేసుకొని పూజలైతే చేయలేదు

Update: 2020-11-15 15:30 GMT
గడిచిన కొద్దిరోజులుగా విశాఖ శారదాపీఠం స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా వివిధ దేవాలయాల్లో పూజలు చేయటంతో పాటు.. స్వామి వారికి కానుకలు ఇవ్వాలంటూ జగన్ సర్కారు సర్య్కులర్ ఇచ్చిందంటూ తెలుగు తమ్ముళ్లు ఇటీవల కాలంలో హడావుడి చేయటం తెలిసిందే. ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందించారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేశారు.

స్వామి వారి పుట్టినరోజునుకూడా టీడీపీ రాజకీయం చేస్తుందన్న ఆయన.. 2016లో స్వామి జన్మదినోత్సవం వేళలో.. అప్పటి టీడీపీ సర్కారు ఇచ్చిన సర్క్యులర్ ను తాము కూడా ఇచ్చామని చెప్పారు. అప్పటి ప్రభుత్వం ఇప్పటిలానే లేఖ రాసిందని గుర్తు చేశారు. మఠాలు.. స్వామిజీల విషయాల్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు.

బాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా రాజకీయం చేస్తున్నారని తప్పు పట్టారు. గత టీడీపీ ప్రభుత్వం చేస్తే తప్పు కానిది.. తాము చేస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. బూట్లు వేసుకొని పూజలు చేసిన చరిత్ర టీడీపీ నేతలదని తప్ప పట్టిన ఆయన.. గతంలో యనమల రామకృష్ణుడు.. సుజనా చౌదరి.. మురళీమోహన్ తదితరులు స్వామీజీ ఆశీస్సులు తీసుకోలేదా? అని ప్రశ్నించారు.

స్వామీజీలకు పార్టీలకు సంబంధం ఉండదని.. వారికి రాజకీయాలు అంటగట్టటం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శారదా పీఠానికి వందల ఎకరాలు రాసిచ్చారని.. అలా తమ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. మొత్తానికి విషయం అటు తిరిగి.. ఇటు తిరిగి చివరకు తెలంగాణ సర్కారు వద్దకు ఆగిన వైనం రానున్న కాలంలో మరో రచ్చకు కారణమవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.




Tags:    

Similar News