ప‌ద‌విచ్చినా కేసీఆర్‌ కు వ్య‌తిరేక‌మే అంటున్న ఉద్య‌మ‌కారుడు

Update: 2016-04-28 06:32 GMT
తెలంగాణ ఉద్యమ సమయంలోను, రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌ తెలంగాణ జేఏసీకి చైర్మన్‌ గా ప్రొఫెసర్‌ కోదండరామ్‌- కో-చైర్మన్‌ గా మల్లేపల్లి లక్ష్మయ్య ఆ బాధ్య‌త‌ల్లో కొనసాగుతూ వ‌చ్చారు. ఇటీవ‌లే తెలంగాణ ప్ర‌బుత్వం బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారిగా మల్లేపల్లి లక్ష్మయ్యను నియ‌మించింది. అ సంద‌ర్భంగా ల‌క్ష్మ‌య్య‌ మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను ప్రభుత్వ పదవిని స్వీకరించినప్పటికీ తెలంగాణ రాజకీయ జేఏసీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని, స‌మాజం కోసం ప‌నిచేస్తుంటాన‌ని వ్యాఖ్యానించారు.

ప్ర‌భుత్వ బాధ్య‌త‌ల నేప‌థ్యంలో జేఏసీకి దూరంగా ఉండే అంశం గురించి ప్ర‌స్తావిస్తూ 'ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, నేను లేకపోయినా జేఏసీ ఉంటుంది...' అని ల‌క్ష్మ‌య్య స్ప‌ష్టం చేశారు. జేఏసీని పునర్‌ వ్యవస్థీకరణ చేసుకోవాలంటూ సూచించానని అందుకనుగుణంగా త్వరలోనే జేఏసీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 'సమాజం కోసం ఒక్కో సందర్భంలో మనం కొన్ని పనులు చేస్తుంటాం. వాటితోపాటు మరికొన్ని పనులు చేయాల్సి ఉంటుంది కదా...?' అని వ్యాఖ్యానించారు.

మ‌ల్లేప‌ల్లి వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో టీ-జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్ సైతం స్పందించారు. మల్లేపల్లి లక్ష్మయ్య ప్రభుత్వ పదవిని స్వీకరించినప్పటికీ జేఏసీకి మద్దతుగానే ఉంటారని భావిస్తున్నామని చెప్పారు. ఆయన జేఏసీకి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 'ఆయనకు బుద్ధుడన్నా - బౌద్ధమతమన్నా ఇష్టం. అందువల్ల దాన్ని అభివృద్ధి చేసేందుకు ఆయన ప్రభుత్వ పదవిని స్వీకరించారని భావిస్తున్నాం...' అని చెప్పారు. తెలంగాణ జేఏసీ త‌ర‌ఫున ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నిస్తామ‌ని గ‌తంలో కోదండ‌రాం స‌హా మ‌ల్లేప‌ల్లి ల‌క్ష్మ‌య్య ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News