సీఎం స్పీచ్ తర్వాత ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ అయిపోయిందా?

అయితే అల్లు అర్జున్ ను సెలబ్రిటీలు కలిసిన తర్వాత పూర్తిగా సీన్ మారిపోయింది. ఈ కేసును తెలంగాణా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందనే విధంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Update: 2024-12-24 17:15 GMT

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ వివాదం యావత్ సినీ ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. సంధ్య థియేటర్‌లో 'పుష్ప 2' ప్రీమియర్ షో చూడటానికి బన్నీ వచ్చిన సమయంలో తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మృతి చెందింది. దీనికి అల్లు అర్జున్ ను బాధ్యుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్‌ వచ్చినప్పటికీ, బన్నీ ఒక రోజు రాత్రి జైలులోనే గడపాల్సి వచ్చింది. ఇక ఈ వివాదంలో అల్లు అర్జున్ కు సినీ ఇండస్ట్రీ నుంచి పూర్తి మద్దతు లభించింది. కానీ ఎందుకనో ఇప్పుడు అందరూ సైలెంట్ అయినట్లు కనిపిస్తోంది.

సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన తర్వాత.. ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక బన్నీ జైలు నుంచి వచ్చిన తర్వాత టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించారు. మెగా హీరోలు మినహా, మిగతా సినీ ప్రముఖులంతా అల్లు అర్జున్ ను కలిసి సంఘీభావం తెలిపారు. ఎవరూ ఈ ఇష్యూ మీద నేరుగా కామెంట్స్ చేయలేదు కానీ, బన్నీకి తమ మద్దతు ఉంటుందని చెప్పకనే చెప్పారు.

అయితే అల్లు అర్జున్ ను సెలబ్రిటీలు కలిసిన తర్వాత పూర్తిగా సీన్ మారిపోయింది. ఈ కేసును తెలంగాణా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందనే విధంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. బన్నీకి అనుకూలంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం.. దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందిస్తూ ఉండటంతో.. ఈ వ్యవహారమంతా 'అల్లు అర్జున్ Vs తెలంగాణ ప్రభుత్వం' అనే విధంగా ప్రొజెక్ట్ చేయబడింది. ప్రతిపక్షాలు సీఎం రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ.. టాలీవుడ్ కు రేవంత్ సర్కారు శత్రువుగా మారుతోందని అనుకునే విధంగా మాట్లాడుతూ వచ్చారు.

అలాంటి టైంలో నేరుగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ అసెంబ్లీ వేదికగా ఈ కేసు గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లొచ్చిన వ్యక్తి ఇంటి ముందు సినిమా వాళ్ళంతా క్యూ కట్టారని, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలుడిని ఎవరూ పరామర్శించలేదని అన్నారు. హీరోకు కాళ్లు చేతులు పోయినట్టు కన్నీళ్లు కారుస్తూ పరామర్శిస్తున్నారు.. నన్ను తిడుతున్నారు. అతనికి కాలు పోయిందా? కన్ను పోయిందా? చేయి పోయిందా? కిడ్నీలు దెబ్బ తిన్నాయా? ఇంతమంది సినీ ప్రముఖులు ఎందుకు అతన్ని పరామర్శిస్తున్నారు? అని రేవంత్ ప్రశ్నించారు.

సినీ ఇండస్ట్రీలో వ్యాపారాలు చేసుకోండి. సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకోండి. ప్రభుత్వం నుంచి ప్రత్యేక రాయతీలు తీసుకుండి. కానీ ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ ప్రభుత్వం ఇవ్వదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు తాను సీఎం పదవిలో ఉన్నంత కాలం తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని ప్రకటించారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఆ తర్వాత పలువురు కాంగ్రెస్ నాయకులు, పోలీసులు సినిమా వాళ్ళను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజల్లోకి తీసుకెళ్లి సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తామని ఒకరంటే.. సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఏమైనా దేవుళ్లా? ప్రజల కోసం ఏం చేస్తున్నారు?, సమాజం కోసం ఏం చేస్తున్నారు? అని మరొకరు ప్రశ్నించారు. తెలంగాణా రాష్ట్రంలో అడుక్కొని తినేవాళ్ళకి ఎన్ని హక్కులు ఉన్నాయో, రంగులు వేసుకొని అడక్కతినే నీకు కూడా అన్నే హక్కులు ఉన్నాయంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కామెంట్లు చేయడం మనం చూశాం. ఇక ఓయూ జేఏసీ పేరుతో కొందరు వ్యక్తులు అలు అర్జున్ ఇంటి మీద రాళ్ళ దాడి చేశారు. ఈ క్రమంలో హెచ్చరికలు జారీ చేశారు.

అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో ఎవరూ మాట్లాడకండి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినా.. ఎవరో ఒకరు ఈ విషయం మీద మాట్లాడుతూనే ఉన్నారు. అల్లు అర్జున్ ఆంధ్రోడివి ఆంధ్రోడిలానే ఉండు అంటూ తాజాగా నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసారు. రేవంత్ రెడ్డిని ఏమైనా అంటే తెలంగాణలో బన్నీ సినిమాలు ఆడనియ్యమని వార్నింగ్ ఇచ్చారు. పగటి వేషాలు వేసుకొని బ్రతకడానికి వచ్చావు, అలానే బ్రతుకు అని అన్నారు. తెలంగాణ కోసం అసలు సినిమా వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు.

అయితే అల్లు అర్జున్ గురించి, సినీ ఇండస్ట్రీ గురించి ఎన్ని మాటలు అంటున్నా.. ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నా టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరూ స్పందించ లేదు. దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. బన్నీని అరెస్ట్ చేసినప్పుడు ట్వీట్లు పెట్టినవాళ్ళు, ఇంటికి వెళ్లి పరామర్శించిన వాళ్ళు ఎవరూ కూడా మళ్ళీ రియాక్ట్ అవ్వలేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు. ఒక్క జగపతి బాబు మాత్రం తాను హాస్పిటల్ కు వెళ్లి బాలుడిని పరామర్శించి వచ్చానని చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

కేసు కోర్టు పరిధిలో ఉందనో, మాట్లాడితే వివాదం మరింత ముదురుతుందనో, ప్రభుత్వంతో గొడవలు ఎందుకులే అనుకున్నారో, మరేదైనా ఇతర కారణం చేతనో తెలియదు కానీ.. టాలీవుడ్ సినీ ప్రముఖులంతా ఇప్పుడు ఈ వివాదంపై సైలెంట్ గా అంటున్నారు. నిజానికి సినీ సెలబ్రిటీలు రాజకీయ వివాదాలు సృష్టించుకోవాలని అనుకోరు. సినిమాలు, వ్యాపారం మీదనే ఎక్కువగా దృష్టి పెడతారే తప్పితే.. ప్రభుత్వంతో ఘర్షణ పడాలని అస్సలు కోరుకోరు. రాజకీయంగా ఏ పార్టీతోనూ వైరం పెంచుకోవడానికి ఇష్టపడరు. ఎవరు అధికారంలో ఉన్నా సరే, వారితో సఖ్యతగా ఉంటూ తనకు కావాల్సిన పనులు చక్కబెట్టుకోవాలనే భావిస్తారు.

సోషల్ మీడియాలో ఏదో ఫ్యాన్స్ హడావుడి చేస్తుంటారు కానీ.. రియాలిటీలో మాత్రం సెలబ్రిటీలు ఎవరూ కూడా రాజకీయ నాయకులతో, ప్రభుత్వంతో శత్రుత్వం పెంచుకోరు. కానీ ఇక్కడ ఊహించని విధంగా అల్లు అర్జున్ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. తప్పు ఒప్పులను న్యాయస్థానం నిర్ణయిస్తుంది. కానీ అంతకంటే ముందు ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి దూరం పెరగకుండా చూసుకోవాలి. ఈ బాధ్యతను ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు తీసుకున్నారని తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తారని, ఇండస్ట్రీ నుండి అందరం వెళ్లి కలిసి మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకుంటామని దిల్ రాజు తెలిపారు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News