మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఆరా?

మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెచ్చుకుంటూ ఇంకా మెరుగైన ఫలితాల సాధన కోసం సూచనలు చేస్తుంటారు.

Update: 2025-01-26 08:30 GMT

కూటమి ప్రభుత్వంలో మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలల్లోనే కొందరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థాయికి తగ్గ పనితీరు కనబరడం లేదని, జిల్లాల్లో పార్టీని ఏకతాటిపై నడపలేకపోతున్నారని చాలా మందిపై ఆరోపణలు ఉన్నాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా కొందరి తీరుపై సంతృప్తికరంగా లేరని చెబుతున్నారు. మంత్రివర్గ సమావేశాల్లో ఒకరిద్దరిపై సీఎం చూచాయగా చెప్పిచూశారు. ఇదే సమయంలో మొత్తం మంత్రివర్గంలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో తెలుసుకునేందుకు రహస్యంగా సర్వే చేస్తున్నట్లు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పనితీరు ఎప్పుడూ విలక్షణంగా ఉంటుంది. మంత్రులకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే వారిపై డేగలా నిఘా వేస్తుంటారు సీఎం. మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెచ్చుకుంటూ ఇంకా మెరుగైన ఫలితాల సాధన కోసం సూచనలు చేస్తుంటారు. ఇందుకోసం ప్రభుత్వ సేవలపై తరుచుగా సర్వేలు చేయించడంతోపాటు ఇంటెలిజెన్స్, పార్టీ వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటుంటారు. అన్ని నివేదికలను భేరీజు వేసుకుని ప్రభుత్వంపై ఓ అంచనాకు వస్తుంటారు. ఈ క్రమంలోనే తనతో కలిసి పనిచేయడంలో వెనుకబడే మంత్రులు, ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తుంటారు.

ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైంది. చంద్రబాబు గత ప్రభుత్వాలకు ప్రస్తుతానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఎన్నడూ లేనట్లు రికార్డు మెజార్టీతో గెలిచిన కూటమి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేలా సమర్థంగా పనిచేయాల్సివుంది. ఈ విషయంలో రాజీపడకుండా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తన సహచరులను కోరుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తోపాటు ఒకరిద్దరు ఈ విషయంలో ముఖ్యమంత్రి అంచనాలకు తగ్గట్టు రాణిస్తుంటే, కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీఎం భావిస్తున్నారు. ఈ విషయాన్ని క్యాబినెట్ భేటీలో ఆయా నేతలకు స్పష్టంగా తెలియజేశారు.

ఈ నేపథ్యంలో మంత్రులు, వారి శాఖల్లో పురోగతి ఎలా ఉందనే విషయాన్ని కూలంకుషంగా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్లు సమాచారం ఇందుకోసం జులై నుంచి డిసెంబర్ మధ్య శాఖల వారీగా చేపట్టిన పనులు, దానివల్ల చేకూరిన ప్రయోజనంపై నివేదికలు తెప్పించుకోవాలని నిర్ణయించారని అంటున్నారు. వీటి ద్వారా ఆయాశాఖల పనితీరుపై ఓ అంచనాకు రావాలని, ఇంకా లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయలేకపోతున్న వారికి మరోసారి చెప్పి చూడాలని ముఖ్యమంత్రి ఆలోచనగా ఉందంటున్నారు. ఏదిఏమైనా ముఖ్యమంత్రి వైఖరిని గమనిస్తే మంత్రుల్లో సమర్థత చూపలేని వారిపై యాక్షన్ దగ్గరలోనే ఉందనిపిస్తోందని సమాచారం.

Tags:    

Similar News