టారిఫ్ తో కొడుతున్న ట్రంప్.. కాళ్ల బేరానికి కొలంబియా!
అవును... అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్.. వారికి సంకెళ్లు వేసి వారి వారి స్వదేశాలకు ప్రత్యేక విమానాల్లో పంపిస్తున్నారు.
‘ట్రంప్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. కాదు, టారిఫ్ లతో కొట్టే ఫైరు’ అని అనుకోవాల్సిన సంఘటన తాజాగా చోటు చేసుకుంది! ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించి.. అమెరికా విమానాలను తిరిగి వెనక్కి పంపించిన కొలంబియా అధ్యక్షుడు కాసేపటికే మెత్తపడ్డారు. దానికి కారణం.. ఈ గ్యాప్ లో ట్రంప్ టారిఫ్ లతో కొట్టారు. దీంతో.. కొలంబియా కాళ్ల బేరానికి రాక తప్పలేదని అంటున్నారు.
అవును... అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్.. వారికి సంకెళ్లు వేసి వారి వారి స్వదేశాలకు ప్రత్యేక విమానాల్లో పంపిస్తున్నారు. దీనిపై పలు దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. ఇందులో భాగంగా.. ఇలా వలసదారులను నేరస్తులుగా ట్రీట్ చేస్తున్నారని మండిపడుతూ ఆ విమానాలను తమదేశంలోకి అనుమతించబోమని కొలంబియా తేల్చి చెప్పింది.
ఈ సందర్భంగా స్పందించిన కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో... కొలంబియా వలసదారులను తీసుకువచ్చే అమెరికా విమానాలను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమ వలసదారులను నేరస్థులుగా చిత్రీకరించకుండా, అమెరికా పౌరవిమనాల్లో పంపిస్తేనే వాటిని తమదేశంలోకి అనుమతిస్తామని తెలిపారు. రెండు విమానాలను వెనక్కి పంపించేశారు.
దీంతో డొనాల్డ్ ట్రంప్ కి చిర్రెత్తుకొచ్చినట్లుంది. వెంటనే రెండు షాకింగ్ నిర్ణయాలు తీసుకొని, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అన్నట్లుగా స్పందించారు. ఇందులో భాగంగా... కొలంబియా ఉత్పత్తులపై సుంకాలు 50 శాతం పెంచుతున్నట్లు, ఆ దేశ ప్రభుత్వ అధికారులను యూఎస్ వీసాలను వెంటనే రద్దు చేస్తున్నానని ప్రకటించారు. త్వరలో మరిన్ని ఉంటాయని హెచ్చరించారు.
ఇలా ప్రకటించిన గంటల వ్యవధిలో కొలంబియా నుంచి కబురొచ్చింది. ఇందులో భాగంగా అమెరికాకు కొలంబియా ప్రెసిడెంట్ సమాచారం అందించారని వైట్ హౌస్ తెలిపింది. ఇందులో భాగంగా.. కొలంబియా వెనక్కి తగ్గి స్వదేశానికి తిరిగి వచ్చిన పౌరులను ఆహ్వానించిందని తెలిపింది. అందువల్ల.. ఈ దేశంపై తాజాగా విధించిన సుంకాలు, పలు ఆంక్షలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
ఇదే సమయంలో... అమెరికాలో అక్రమంగా ఆశ్రయం పొందుతున్న తమ తమ పౌరులను వెనక్కి పిలిపించుకోవడానికి ప్రపంచ దేశాలు తగిన చర్యలు తీసుకోవాలని, తమతో సహకరించాలని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో... ట్రంపా.. మజాకా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!