32 ఏళ్ల తర్వాత అక్కడకు వెళ్లిన సీఎంగా రేవంత్ రికార్డు
అంచనాలు పెద్దగా లేని ప్రముఖులకు ఉండే లాభాలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు ఉన్నాయి.
అంచనాలు పెద్దగా లేని ప్రముఖులకు ఉండే లాభాలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించటం.. పార్టీ అధినాయకత్వం సైతం రేవంత్ మీద నమ్మకం పెట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టటం వరకు ఒక ప్రహసనం అయితే.. ఆ కుర్చీలో కుదురుకోవటం.. ఒక్కొక్కటిగా తాను చేయాలనుకున్న పనుల్ని చేసుకుంటూ వెళ్లటం అంత సామాన్యమైన విషయం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ ఆ దశల్ని ఒక్కొక్కటిగా దాటుకుంటూ ముందుకు వెళుతున్నారు.
ఆయన మీదా.. ఆయన పాలన మీద పెద్దగా అంచనాలు లేవు. దీనికి తోడు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా నడుచుకుంటున్న వేళ.. అందరిని ఒక తాటిన తీసుకెళ్లకపోయినా.. ఒకే బాటలో నడుస్తున్న భావన కలిగేలా చేయటమే అతి పెద్ద సవాలు. ఈ విషయంలోనూ రేవంత్ విజయం సాధించారు. ఇప్పుడు తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే దిశగా ఆయన అడుగులు పడుతున్నాయి. దావోస్ పర్యటన సందర్భంగా.. అలా వెళ్లి.. ఇలా రావటం.. మహా అయితే కాసిన్ని పెట్టుబడులు తీసుకురావటమే అనుకున్నారు కానీ.. అందుకు భిన్నంగా రికార్డు స్థాయిలో దగ్గరదగ్గర ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయిల పెట్టుబడుల్ని ఆకర్షించటం సామాన్యమైన విషయం కాదు.
గత ప్రభుత్వంలో షాడో సీఎంగా వ్యవహరించిన కేటీఆర్ సైతం ఈ మార్కు కాదు కదా.. ఇందులో సగం పెట్టుబడుల్ని సైతం సాధించుకొచ్చింది లేదు. ఆ లెక్కన చూస్తే.. సీఎం రేవంత్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నట్లే. ఇటీవల కాలంలో ఆయన తీరు చూస్తే.. నెమ్మది నెమ్మదిగా తనను తాను విస్తరించుకుంటున్న వైనం కనిపిస్తుంది. గత ముఖ్యమంత్రి మాదిరి పరిమిత కార్యక్రమాలకు హాజరు కావటం.. ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండటం లాంటి తీరుకు భిన్నంగా అందరికి హ్యాండీగా ఉండే ముఖ్యమంత్రిగా తన ఇమేజ్ ను పెంచుకుంటున్నారు.
రిపబ్లిక్ డే వేళ.. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అదే సమయంలోజూబ్లీహిల్స్ లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక్కడ ఆసక్తికర అంశం ఏమంటే.. దాదాపు 32 ఏళ్ల తర్వాత ఈ వర్సిటీలో అడుగు పెట్టిన మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రికార్డును క్రియేట్ చేవారు. గతంలో మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావు.. దివంగత మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు మాత్రమే సందర్శించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ మాత్రమే హాజరైంది.
ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయం కొండపై 15 అడుగుల ఎత్తులో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించటంతో పాటు.. రూ.30 కోట్లతో ఏర్పాటు చేస్తున్న డిజిటల్ రిసోర్స్ సెంటర్ పనుల్ని ప్రారంభించారు. దీంతో పాటు మరిన్ని పనుల్ని ప్రారంభించిన ఆయన.. వర్సిటీకి సంబంధించిన రూ.500 కోట్ల ఆస్తులు ఇంకా ఏపీలోనే ఉన్నట్లుగా గుర్తు చేసుకోవటం చూస్తే.. ముఖ్యమంత్రి రేవంత్ ఏ విషయాన్ని వదిలి పెట్టేలా లేరన్న అభిప్రాయం కలుగక మానదు.