మ‌మ‌త గేమ్ బాగుంది.. బీజేపీ బూచితో అంత‌టా పాగా వేస్తోంది

Update: 2021-12-14 16:30 GMT
2014 ఎన్నిక‌ల వ‌ర‌కూ దేశంలో కాంగ్రెస్‌కు తిరుగులేదు. జాతీయ రాజ‌కీయాల్లో ఆ పార్టీ ఏక‌ఛ‌త్రాధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. కానీ దేశ‌వ్యాప్తంగా ఆ పార్టీపై ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన వ్య‌తిరేక‌త‌కు తోడు మోడీ ప్ర‌భ కార‌ణంగా ఆ ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్కు చావు దెబ్బ త‌ప్ప‌లేదు. అప్ప‌టి నుంచి ఆ పార్టీ దిగ‌జారిపోతుండ‌గా.. బీజేపీ దేశ‌మంత‌టా నెమ్మ‌దిగా పాగా వేయ‌డం మొద‌లైంది. ఇక 2019 ఎన్నిక‌ల్లోనూ మోడీకి తిరుగులేకుండా పోయింది. కానీ తాజా ప‌రిస్థితులు చూస్తుంటే మోడీపై కూడా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతున్న‌ట్లు తెలుస్తోంది. దీన్ని అదునుగా తీసుకుని తిరిగి గ‌ద్దెనెక్కే ప్ర‌య‌త్నాల‌ను కాంగ్రెస్ చేయ‌డం లేద‌నే అభిప్రాయాలున్నాయి.

ఇక బీజేపీ, కాంగ్రెస్ ప‌రిస్థితి ఇలా ఉంటే.. జాతీయ రాజ‌కీయాల్లో వాటికి ప్ర‌త్యామ్నాయ శ‌క్తిని తానే అంటూ బెంగాల్ ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ దూసుకోస్తున్నారు. బీజేపీని ఓడించే స‌త్తా త‌మ‌కే ఉందంటూ దేశ‌వ్యాప్తంగా పార్టీని విస్త‌రించే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. కాంగ్రెస్ కూట‌మి ఇంకా ఎక్క‌డ ఉందంటూ ప్ర‌శ్నించి తానే బీజీపీకి స‌రైన ప్ర‌త్యామ్నాయ‌మ‌ని ఆమె భావిస్తున్నారు. బీజేపీ బూచి చూపించి చాప కింద నీరులా దేశ‌వ్యాప్తంగా పాగా వేసేందుకు ఆమె సిద్ధ‌మ‌య్యారు. అందుకు ముందుగా వ‌చ్చే ఏడాది జ‌రిగే అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌పై ఆమె ప్ర‌త్యేక దృష్టి సారించారు.

గోవాలో బీజేపీ నుంచి అధికారాన్ని లాక్కోవ‌డ‌మే ల‌క్ష్యంగా మ‌మ‌త పావులు క‌దుపుతున్నారు. వ‌చ్చే ఏడాది గోవాలో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య‌మే లక్ష్యంగా ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని దీదీ హోరెత్తిస్తున్నారు. తృణ‌మూల్ కాంగ్రెస్‌ను జాతీయ పార్టీగా తీర్చిదిద్దాల‌నే ల‌క్ష్యంతో ఉన్న ఆమె గోవాపై క‌న్నేశారు. ఇటీవ‌ల కాలంలో రెండోసారి ఆమె గోవాలో ప‌ర్య‌టిస్తున్నారు. 40 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో అధికారం కోసం ఇప్పటికే ఆమె ఎన్నిక‌ల్లో పోటీకి మ‌హారాష్ట్రవాది గోమంత‌క్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇక ఆ రాష్ట్రంలో బీజేపీని ఓడించాలంటే విప‌క్షాలు త‌మ‌తో క‌లిసి రావాల‌ని ఆమె కోరారు. మోడీపై పోరాటంలో ఏ పార్టీ ముందుకు వ‌చ్చినా స్వాగ‌తిస్తామ‌ని ఆమె పేర్కొన్నారు. మొత్తానికి గోవాని ద‌క్కించుకునేందుకు ఆమె విప‌క్షాలను ఏకం చేసే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు.
Tags:    

Similar News