కేసీఆర్ ఎఫెక్ట్ తో సోనియమ్మ‌కు మ‌మ‌త షాక్!

Update: 2018-03-13 04:39 GMT
రాజ‌కీయాల్లో ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. కాలం చాలామందిని ఊహించ‌నంత స్థాయికి తీసుకెళుతుంది. ఒక‌ప్పుడు సోనియ‌మ్మ అపాయింట్ మెంట్ ల‌భించినా.. ఆమె మాట్లాడేందుకు పిలిస్తే సంతోషించే కేసీఆర్‌.. ఈ రోజున అదే సోనియ‌మ్మ ఇంటికి ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు వెళ్ల‌కుండా చేసేస్తున్నారా? అంటే.. అవున‌ని చెప్పాలి.

ఇదంతా కేవ‌లం నాలుగైదేళ్ల‌లో చోటు చేసుకోవ‌టం విశేషంగా చెప్పాలి. జాతీయ రాజ‌కీయాల వైపు దృష్టి పెట్టాల‌న్న ఆలోచ‌న‌కు వ‌చ్చిన కేసీఆర్.. గ‌డిచిన కొన్ని రోజులుగా ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌టం.. త‌న వాద‌న‌ను వినిపించ‌టం చేస్తున్నారు. కేసీఆర్ వాద‌న జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మార‌ట‌మే కాదు.. ఆయ‌న‌తో జ‌త క‌ట్టేందుకు ప‌లువురు  ఆస‌క్తి చూపిస్తున్నార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామం చూస్తే.. ఇది నిజ‌మ‌నిపించ‌క మాన‌దు. బీజేపీ.. కాంగ్రెసేత‌ర పార్టీల‌తో క‌లిసి ఒక కూట‌మిని ఏర్పాటు చేయాల‌ని.. అందులో తాను కీ రోల్ ప్లే చేయాల‌న్న‌ది కేసీఆర్ ఆశ‌.. ఆకాంక్ష‌. ఈ కూట‌మి విష‌యంలో ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జి స‌హా ప‌లువురు నేత‌లు ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు (మంగ‌ళ‌వారం) కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ విందు స‌మావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

దీనికి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. త‌మిళ‌నాడు విప‌క్ష నేత స్టాలిన్ తో స‌హా.. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీతో పాటు.. ప‌లువురు జాతీయ నేత‌ల‌కు ఆమె స్వ‌యంగా ఆహ్వానించారు.

ఈ విందుకు తాను హాజ‌రు కాలేక‌పోతున్న‌ట్లుగా మ‌మ‌త స‌మాచారం ఇవ్వ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. యూఏపీ ప‌క్షాల‌తో పాటు.. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్య‌తిరేకంగా జ‌ట్టు క‌ట్టి.. సార్వ‌త్రిక ఎన్నికల నాటికి బ‌ల‌మైన ప‌క్షం త‌యారు చేయాల‌ని.. అందుకు కాంగ్రెస్ కీల‌క‌పాత్ర పోషించాల‌ని సోనియాగాంధీ త‌ల‌పోస్తున్నారు.  ఇందుకు త‌గ్గ‌ట్లే ఈ రోజు విందు స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సోనియ‌మ్మ విందుకు మ‌మ‌త డుమ్మా కొట్టాల‌న్న నిర్ణ‌యం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఇదంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎఫెక్ట్ గా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు. థ‌ర్డ్‌ ఫ్రంట్ పెడ‌దామంటూ కేసీఆర్ పిలుపునిచ్చిన క్ర‌మంలో సోనియా విందుకు తాను వెళితే రాంగ్ సిగ్న‌ల్స్ వెళ‌తాయ‌న్న ఆలోచ‌న‌లోనే విందుకు వెళ్ల‌కూడ‌ద‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా తెలుస్తోంది.

అయితే.. సోనియ‌మ్మ‌తో విందుకు హాజ‌రు కాక‌పోవ‌టానికి కార‌ణం.. డార్జిలింగ్ లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో పాల్గొనాల్సి రావ‌టంగా చెబుతున్న‌ప్ప‌టికీ.. అస‌లు కార‌ణం మాత్రం కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ ఆలోచ‌నేన‌ని చెబుతున్నారు. మ‌మ‌త నిర్ణ‌యం వెనుక కేసీఆర్ ప్ర‌భావం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ అంచ‌నాలో నిజం ఎంత‌న్న‌ది రానున్న రోజుల్లో తేలిపోతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News