అత్యాచారం జ‌రిగినందుకు కాదు..ఆమె కులంతోనే న్యాయం

Update: 2019-12-10 15:26 GMT
మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి అధ్యక్షుడు మంద కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రేప్ ఘటనల్లోనూ అగ్రకులాలకు తప్ప - బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరగడం లేదని ఆరోపించారు. దేశంలో రోజూ ఎస్సీ - ఎస్టీ - బిసీ - మైనారిటీ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని అయితే, వారిని పట్టించుకునేవాళ్లు లేరని మంద కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ - కులంతో సంబంధం లేకుండా బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ దారుణ మాన‌భంగం - హ‌త్య‌ కంటే మూడు రోజుల ముందు ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌ లో గిరిజన మహిళ సమతపై ఘోరంగా అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన జరిగిందని మంద కృష్ణ తెలిపారు. దిశ ఘటనలో కులం ఎక్కువగా ప్రచారం అయిందని మంద కృష్ణ అన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారని - పార్లమెంటులోనూ గట్టిగా మాట్లాడారని ఆయన చెప్పారు. దిశ ఘటనలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టినా.. పట్టించుకోకుండా ఎన్‌ కౌంటర్‌ తో ప్రతీకారం తీర్చుకున్నారని పేర్కొన్నారు.

ఢిల్లీలో నిర్భయ - హైదరాబాద్‌ లో దిశ.. ఈ రెండు ఘటనలు మాత్రమే బయటకు వచ్చాయని మంద‌కృష్ణ‌ అన్నారు. దిశ కంటే ముందు జ‌రిగిన ఘ‌ట‌న విష‌యంలో ఫాస్ట్‌ ట్రాక్ కోర్టు కానీ ప్ర‌భుత్వ స్పంద‌న‌లో కానీ స్ప‌ష్ట‌మైన తేడా ఉంద‌న్నారు. ఇప్ప‌టికీ...ద‌ళిత మ‌హిళ‌కు న్యాయం జరుగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు - హత్యల విషయంలో మానవత్వంతో చర్చించాలని - కుల ప్ర‌మేయం లేకుండా ప‌రిష్కార మార్గాలు చూడాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

   

Tags:    

Similar News