సుమలత వైపే 'మాండ్య' గాలి..!

Update: 2019-04-14 04:59 GMT
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పూర్తయింది. రెండో విడతలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంతో అధికారంలో ఉన్న జేడీఎస్‌ దళ్‌ పార్లమెంట్‌ స్థానాలపై గురిపెట్టింది. వీటిలో ముఖ్యంగా మాండ్య నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ బరిలో ఉన్నారు. అటు ఇండిపెండెంట్‌ గా దివంగత ఎంపీ సతీమణి - సినీ నటి సుమలత ధీటైన పోటీనిస్తున్నారు. మొన్నటి వరకు ఎవరికీ తెలియని మాండ్య నియోజకవర్గంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ నియోజకవర్గంపై సాక్షాత్తూ ప్రధానమంత్రి మోడీ   కామెంట్‌ చేయడంపై మరింత ఆసక్తి నెలకొంది.

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ స్వతంత్ర అభ్యర్థి సుమలతకు మద్దతు విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే మద్దతును కూడగట్టుకున్న సుమలతపై ఇప్పుడు అధికారంలో భాగమైన కాంగ్రెస్‌ కూడా సపోర్టు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఓ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనాయకులు జేడీఎస్‌ దళ్‌ కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలని ప్రసంగించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధరామయ్య పార్టీ నాయకులను ఎన్నిసార్లు వారించినా వారు సుమలతకే మద్దతునిస్తున్నారు.

ఇక మాండ్య ఎన్నికల జిల్లా అధికారి మంజు శ్రీ పై ఎలక్షన్‌ కమిషన్‌ వేటు వేసింది. ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పినట్లు అధికారిని వ్యవహరిస్తుందంటూ సుమలత ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఆమెను బదిలీ చేసి ఆమె స్థానంలో పి.సి.జాఫర్‌ అనే అధికారిని నియమించారు. ఈ వ్యవహారంపై సీఎం గరంగరంగా ఉన్నారు. ఇది భారతీయ జనతాపార్టీ కుట్రలో భాగమేనన్నారు.

ఇక అంబరీష్‌ సతీమణిగా - సినీ నటిగా సుమలతకు రోజురోజుకు ఫాలోయింగ్‌ విపరీతంగా పెరుగుతోంది. అంబరీష్‌ స్థానంపై సానుభూతిని చూపకుండా సీఎం కుమారస్వామి కావాలనే తన కుమారుడిని బరిలోకి దించారని పలువురు ఆరోపిస్తున్నారు. అటు సినీ వర్గాలు సైతం సుమలతకు ఎక్కువగా మద్దతు పలుకుతుండడంతో ఆమెకు ఫాలోయింగ్‌ ఎక్కువవుతోంది. దీనికి తోడు ఇటీవల ప్రధాని పర్యటన సందర్భంగా సుమలతకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం మరింత ఆసక్తి నెలకొంది.
Tags:    

Similar News