ఆపరేషన్ గరుడ అవాస్త‌వం:మాణిక్యాల రావు

Update: 2018-09-10 12:59 GMT
`ఆపరేషన్ గరుడ వేగ‌`.......కొద్ది నెల‌ల క్రితం టాలీవుడ్ లో విడుద‌లై హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా. రాజ‌శేఖ‌ర్ కు టాలీవుడ్ లో మ‌ర‌చిపోలేని హిట్ ఇచ్చిన సినిమా. ఆ సినిమా ఉత్కంఠ రేపే స‌న్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఆ సినిమా క‌థ‌కు త‌గ్గ‌ట్లే అదే పేరుతో 3 నెల‌ల క్రితం `ఆప‌రేష‌న్ గ‌రుడ‌`పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఆప‌రేష‌న్ గ‌రుడ ఒక‌టుంద‌ని - దాని ప్ర‌కారం చంద్ర‌బాబు చిక్కుల్లో ప‌డ‌తార‌ని హీరో శివాజీ కొద్ది నెల‌ల క్రితం చేసిన ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపాయి. తాజాగా, మ‌రోసారి ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో భాగంగా చంద్రబాబుకు కేంద్రం నోటీసులివ్వ‌బోతోందంటూ శివాజీ మ‌రోసారి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఓ కేంద్ర సంస్థ నుంచి ఏపీ సీఎం కు నోటీసులు వస్తాయని - వాటికి సంబంధించిన వివరాలు బ‌య‌ట‌పెట్ట‌లేన‌ని అన్నారు. అంతేకాదు, తనకు ప్రాణహాని కూడా ఉందని విలేకరుల సమావేశంలో చెప్పి క‌ల‌క‌లం రేపారు. ఈ నేప‌థ్యంలో ఆప‌రేష‌న్ గ‌రుడ‌పై ఏపీ బీజేపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే మాణిక్యాల రావు స్పందించారు. అస‌లు ఆప‌రేష‌న్ గ‌రుడ‌కు బీజేపీకి సంబంధం లేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మరోవైపు, చంద్ర‌బాబుపై బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఢిల్లీలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఆపరేషన్‌ గరుడ అనేది అవాస్తవమ‌ని - శివాజీతో టీడీపీ నేతలే ఇలా చెప్పిస్తున్నార‌ని మాణిక్యాల‌రావు అన్నారు. అందుకే,ఆపరేషన్‌ గరుడపై విచారణ జరపాలని డీజీపీని ఏపీ బీజేపీ నేతలు కోరామ‌ని - ఆ ఆప‌రేష‌న్ గ‌రుడ నిజమైతే నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరామ‌ని - ఒక వేళ అది అబ‌ద్ధ‌మైతే శివాజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామ‌ని అన్నారు. మ‌రోవైపు, ఏపీలో అవినీతి పాలన సాగుతోందని కన్నా ఢిల్లీలో మండిప‌డ్డారు. బాబును మించిన అవినీతిపరుడు ఈ ప్రపంచంలో మరెక్కడా ఉండరని నిప్పులు చెరిగారు. టీడీపీ ఓ డ్రామా కంపెనీ అని, ఆ పార్టీకి సిద్ధాంతం లేద‌ని అన్నారు. ఏపీలో బీజేపీపై టీడీపీ నేత‌లు విష ప్రచారం చేశారని, 2019లో టీడీపీకి ఏపీ ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఆప‌రేష‌న్ గ‌రుడపై డిజీపీకి బీజేపీ నేత‌లు ఫిర్యాదు చేయ‌డం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.


Tags:    

Similar News